వానొచ్చే.. వరదొచ్చే | - | Sakshi
Sakshi News home page

వానొచ్చే.. వరదొచ్చే

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

సాక్షి, మహబూబాబాద్‌: సకాలంలో వర్షాలు కురవక.. దాదాపు కరువు ఛాయలు అలముకున్న జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కువరడంతో వరద వస్తోంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాల్లోకి నీరు చేరుతోంది. వానదేవుడినే నమ్ముకొని సాగుచేసిన వరి పంటపై పెట్టుకున్న ఆశలు పదిలమని రైతులు చెబుతున్నారు. అదేవిధంగా సాగుచేసిన పత్తికి ఇప్పటి వరకు ఫర్వాలేదు. వర్షాలు మరో రెండు, మూడు రోజులపాటు కురిస్తే పత్తికి నష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉరకలు..

జిల్లాలో బుధవారం సాయంత్రం వర్షం మొదలైంది. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా సగటున 82మిల్లీ మీ టర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా నెల్లికుదురు మండలంలో 123.6 మిల్లీమీటర్లు, మరిపెడ 122.6, పెద్దవంగర మండలంలో 118.6 మిల్లీ మీటర్లు కురవగా.. అత్యల్పంగా గంగారంలో 34.6 మిల్లీమీటర్లు, కొత్తగూడలో 35.8 మిల్లీ మీటర్లు కురిసింది. అదే విధంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గంగారం మండలంలో 15.8 మిల్లీమీటర్లు, కొత్తగూడలో 9.8 మిల్లీమీ టర్లు, తొర్రూరు 9.5 మిల్లీ మీటర్లు మొత్తం జిల్లాలో 69 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాలేరుతోపాటు పలు వాగుల్లో భారీగా నీరు చేరి ప్రవహిస్తోంది. అలాగే జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి కూడా నీరు చేరుతోంది.

వరికి ఆశలు.. పత్తిపై భయం..

భారీ వర్షాలతో వరి పంటకు మేలు జరుగుతోంది. వర్షాలు ఎక్కువగా కురిస్తే పత్తి పంటలకు నష్టం. జిల్లాలో ప్రస్తుతం 3,28,475 ఎకరాల్లో మాత్రమే సాగుచేశారు. ఇందులో పత్తి 91,916 ఎకరాల్లో సాగుచేయగా.. వరి 1,49,162 ఎకరాలు, మొక్కజొన్న 58,655 ఎకరాలు, 21,585ఎకరాల్లో పెసర సాగుచేశారు. అయితే ఇందులో పత్తి, మొక్కజొన్న పంటలు కాత పూత, పాలకంకి పోసింది. పెసర పంట కోయడం పూర్తి దశకు వచ్చింది. వరి పొట్టదశలో ఉంది. పత్తి పూత, కాత దశలో, మొక్కజొన్న చివరి దశకు చేరుకుంది. ఈ వర్షాలతో వరి పంట వెన్నులు బయటకు వచ్చే అవకాశం ఉంది. పత్తికి ఇప్పటి వరకు ఢోకా లేకున్నా.. వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం జాలువారిపోయి, పగిలిన పత్తి నల్లబారి నష్టం జరుగుతుంది.

పొంగుతున్న వాగులు, ఏర్లు

జలాశయాల్లోకి చేరుతున్న నీరు

వరి పంటపై ఆశలు పదిలం

పత్తిపంటకు పొంచిఉన్న ముప్పు

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశం

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు. జిల్లా అధికారులతో పాటు మండల రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులతో వర్షాలపై సమీక్షించారు. ప్రధానంగా విద్యాసంస్థలు, హాస్టల్స్‌, గురుకులాల్లో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు వేడి వేడి అన్నం పెట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ అధికారులు ప్రమాదకరమైన చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement