కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ 24వ స్నాతకోత్సవ సంబురం అంబరాన్నంటింది. నిట్ క్యాంపస్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న కాన్వొకేషన్ మహోత్సవంలో తొలిరోజు శనివారం 930 మంది యూజీ, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. గౌరవ అతిథిగా నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరై అధికారికంగా స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, డిగ్రీ పట్టాలు అందించారు.
వ్యక్తిత్వానికి దిక్సూచి.. నిట్ విద్యార్థులు
వ్యక్తిత్వానికి దిక్సూచిగా నిట్ విద్యార్థులు నిలవాలని, వ్యక్తిత్వమే భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ తెలిపారు. టెక్నికల్ స్కిల్స్, డిగ్రీలు, రెజ్యూమ్ ఒక వ్యక్తి కెరీర్‌కు సాఫ్ట్‌వేర్ వంటివి కాగా, వ్యక్తిత్వం, నిజాయతీ, విశ్వసనీయత హార్డ్‌వేర్ వంటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవనం కొనసాగించాలన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలోని ఈల్డ్‌ను ఉదాహరణగా తీసుకుని వైఫల్యాలను అధిగమించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. మైక్రో గ్రిడ్, వ్యవసాయ సెన్సార్లు, సురక్షిత తాగునీరు అందించడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం నూతన ఆవిష్కరణలతోనే సాధ్యమని తెలిపారు.
ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకం
నేటి ఏఐ యుగంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకమైందని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. ‘ద రోల్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఇన్ ద ఏఐ ఎరా’ అంశంపై మాట్లాడారు. వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంజనీర్ల బాధ్యతలు మరింతగా విస్తరిస్తున్నాయని, సమాజానికి సేవ చేయడానికి నిట్ విద్యార్థులు ముందుండాలన్నారు.
విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యయనం
స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాలను అందుకోవడం విద్యార్థుల జీవితాల్లో నూతన అధ్యాయానికి నాంది అని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్‌లో విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరంలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ వెహికిల్స్, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంటెక్ విభాగంలో నూతన కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో యూజీ విద్యార్థులు 93.94 శాతం, పీజీ విభాగంలో 80.78 విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారని అత్యధిక ప్యాకేజీ రూ.1.27 కోట్లు నమోదైనట్లు తెలిపారు.
నేడు పట్టాలందుకోనున్న పీజీ విద్యార్థులు..
స్నాతకోత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివా రం పీజీ (బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ)పీహెచ్‌డీ విద్యార్థులు బెస్ట్ పీహెచ్‌డీ ఽథీసిస్, బెస్ట్ ఎంటెక్ అవార్డులతో పాటు రోల్ ఆఫ్ హనర్ గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. 945 పీజీ, 100 పీహెచ్‌డీ, 22 ఎగ్జిట్ డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు.
నిట్‌లో అంబరాన్నంటిన 24వ స్నాతకోత్సవం
పట్టాలందుకున్న 930 యూజీ,
22 ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులు
నేడు 1,067 మంది
పీజీ విద్యార్థులకు ప్రదానం


