● హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ సదస్సుకు హాజరయ్యే క్రమంలో భాగంగా జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ స్థానిక బార్ అసోసియేషన్ హాలులో శనివారం న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయవాద వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, ఆరంభంలో న్యాయవాదులుపడే కష్టాలను గుర్తుచేసుకున్నారు. తాను గతంలో సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఒక కేసు నిమిత్తం మహబూబాబాద్ కోర్టుకు న్యాయవాదిగా వచ్చిన సందర్భంలోని పరిస్థితులను నెమరువేసుకున్నారు. ఆ సమయంలో స్థానిక బార్ అసోసియేషన్ అందించిన ఆత్మీయ ఆతిథ్యాన్ని, గౌరవాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణంపై ఆయన స్పందిస్తూ సంబంధిత ఫైళ్లను త్వరగా ముందుకు తీసుకెళ్లి పనులు వేగవంతమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ, ఇతర ప్రక్రియలను వేగవంతం చేసేందుకు రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ కూడా పూర్తి సహకారం అందిస్తామన్నారని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదుల క్లర్కులు హైకోర్టు న్యాయమూర్తులు ఈవీ వేణుగోపాల్, బీఆర్.మధుసూదన్ రావును సత్కరించారు. సమావేశంలో మూడు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.మురళీమోహన్, ఎస్వీపీ.సూర్యచంద్రకళ, జీవన్ కుమార్, న్యాయాధికారులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి జంగం సిద్ధార్ధ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


