మండపాలే అవగాహన కేంద్రాలు.. | - | Sakshi
Sakshi News home page

మండపాలే అవగాహన కేంద్రాలు..

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

సైబర్‌ సెక్యూరిటీపై అలర్ట్‌ చేస్తూ పోస్టర్ల ఏర్పాటు

మహబూబాబాద్‌: జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో వినాయకుడు కొలువుదీరాడు. జిల్లా కేంద్రంలోని పెనుగొండ గోపయ్య బజార్‌లో శ్రీపానిణి పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన మండలంలో మహరాజా మట్టి వినాయక విగ్రహం, డెకరేషన్‌ ఆకర్షనీయంగా ఉన్నాయి. ఇక్కడ శ్రీరామ్‌సేన ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు.

సైబర్‌ సెక్యూరిటీపై

అవగాహన

వినాయక విగ్రహం చేతిలో సైబర్‌ సెక్యూరిటీ సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఓటీపీలు, లింక్‌లు, ఇతరత్రా అంశాలపై అవగాహన కల్పించేలా ఈ పోస్టర్లు రూపొందించారు. ప్రజలు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ఏవిధంగా అప్రమత్తంగా ఉండాలో ఆ పోస్టర్ల ద్వారా అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్పీ శబరీష్‌ ఆ మండపాన్ని సందర్శించి కమిటీ బాధ్యులు పి.వంశీ, కె.వంశీ, నిఖిల్‌, రవి కిరణ్‌, మురళీ, మహేష్‌, అభినవ్‌ను అభినందించారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలో చాలా వరకు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రజల్లో పర్యావరణపై అవగాహన ఉండటంతో మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డీజే ల వాడకం వినియోగం సైతం తగ్గింది.

అవయవం.. ఆదర్శం

గణపతి అవయవాల విశిష్టతపై ప్రచారం

వినాయక మండపంలో ఫ్లెక్సీల ఏర్పాటు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ పట్టణంలోని ఏ క్యాబిన్‌ రోడ్డులో ఏజ్‌ లెస్‌ బాయ్స్‌ ఆధ్వర్యంలో కొలువుదీరిన మట్టి సిద్ధి వినాయకుడి సన్నిధిలో గణపతి అవయవాల వెనుక దాగిఉన్న అర్థాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కౌన్సిలర్‌ ముత్యం వెంకన్న గౌడ్‌ బహూకరించగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు నక్క గౌతమ్‌, ఆగుర్తి పాండిత్య, ఎర్రం శెట్టి సాయినాయుడు, కొప్పు కౌశిక్‌ కుమార్‌, ఆగుర్తి లోకేష్‌, కత్రి సుమంత్‌, జంపాల సాయికుమార్‌, ఆగుర్తి పునీత్‌, వేల్పుల సాకేత్‌, దారావత్‌ సుధీర్‌, కొట్టు సాయి కార్తీక్‌, నూతన్‌ కుమార్‌, ఆగుర్తి దినేష్‌ చెన్నూరి హరి నిర్వహణ బాధ్యుతలు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా గణపతి ఏనుగు తల అపారమైన జ్ఞానం వివేకానికి చిహ్నం అని.., అభయ హస్తం.. భయం వద్దు నేనున్నాను.. అనే రక్షణ వాగ్దానం అని.., మూషిక వాహనం.. కోరికలు, మనసు, చంచలత్వం నియంత్రణలో ఉండాలని సూచిస్తుందని వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విరిగిన దంతం త్యాగం, జ్ఞానం కోసం అంకిత భావాన్ని తెలియజేస్తుందని, గణపతి చిన్న కళ్లు ఏకాగ్రత, లక్ష్యంపై పూర్తి దృష్టి సారించాలంటున్నాయని తెలియజేస్తూ ఫ్లెక్లీలు ప్రదర్శించారు. గణపయ్య పెద్ద బొజ్జ.. జీవితంలో మంచి, చెడును సమానంగా స్వీకరించాలని, తొండం బలం, సున్నితత్వం, గణపతి చేతిలోని మోదకం ఆత్మజ్ఞానం, భక్తి సదాచారం ఫలితమే ఆనందం, గణపతి పెద్ద చెవులు ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అనే సందేశం, గణపతి కూర్చున్న పద్మాసనం స్థిరత్వం, సమతుల్యత ఆధ్యాత్మిక స్థిరమైన జీవనం గురించి తెలియజేస్తుందని వివరిస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement