కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ : వసతి గృహాల నిర్వహణపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ప్రత్యేక అధికా రులు వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయించాలన్నారు. ప్రజా పాలన సంక్షేమ వారోత్సవాల యాక్షన్ ప్లాన్ ప్రకారం.. అన్ని పనులు చేయించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
23న నిజాం చెరువులో నిమజ్జనం
మహబూబాబాద్: పురోహితులు, గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యులు, అధికారులతో చర్చించి ఈనెల 23న వినాయక విగ్రహాల నిమజ్జనానికి నిజాం చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి తెలిపారు. నిజాం చెరువును పరిసరాలను శనివారం ఆమె.. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, డీఎస్పీ తిరుపతి రావు, కమిషనర్ వినోద్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. నిమజ్జనం విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సహకరించాలన్నారు. క్రేన్స్, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చిట్యాల జనార్దన్, ఇన్‌చార్జ్ టౌన్ సీఐ అంజలి, ఏఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎండ నుంచి రక్షణగా..
బయ్యారం: సెప్టెంబర్ మాసంలోనూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు తలో ఉపాయం ఆలోచిస్తున్నారు. ఈక్రమంలో మండలకేంద్రంలో సెంట్రింగ్ పనులు నిర్వహిస్తున్న వజీర్ శనివారం ప్రత్యేకంగా తయారు చేసుకున్న గొడుగును తలపై పెట్టుకొని పనులు చేస్తుండడం అందరినీ ఆకర్షించింది.
ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14, 17, 19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
వేయిస్తంభాల ఆలయంలో దూర్వాయుగ్మ పూజ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కొనసాగుతున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలమహాగణపతిని శ్రీహేరంబగణపతిగా అలంకరించి దూర్వాయుగ్మ పూజ నిర్వహించారు.


