● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, బీఆర్‌ఎస్ పాలనలో పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల 6శాతం రిజర్వేషన్‌ను 10శాతం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం అని కొనియాడారు. గిరిజనులంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. ఈనెల 17న ప్రతీ తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. 17న భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు తేజస్విని, నరేష్, నాయకులు అశోక్, బిక్కు తదితరులు పాల్గొన్నారు.


