కురిసిన వర్షంతో చెరువుల్లో జలకళ
రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెరువుల్లో నీరు చేరింది. అయితే నీటిని ఆయకట్టు పంటలకు విడుదల చేయమని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో గతేడాది 4,561,36 ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులు ప్రస్తుతం 3,28,475 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఇందులో అత్యధికంగా పత్తి 91,916 ఎకరాల్లో సాగు చేయగా.. వరి 1,49,162 ఎకరాలు, మొక్కజొన్న 58,655 ఎకరాలు, 21,585 ఎకరాల్లో పెరస పంట సాగుచేశారు. అయితే ఇందులో పత్తి, మొక్కజొన్న పంటలు కాత పూత, పాలకంకి పోసింది. వీటికి ఇప్పుడు నీరు అత్యధికంగా కావాలి. లేకపోతే పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ వర్షంతో పత్తి మొదటి క్రాప్ వస్తుందని, మొక్కజొన్నకు మరో పదిరోజుల తర్వాత మరొక వర్షం పడితే చాలని రైతులు చెబుతున్నారు. అయితే చెరువులనే ఆధారంగా చేసుకొని వేసిన వరినాట్లు, ఇతర పంటలకు చెరువు నీరు విడుదల చేస్తేనే పంటలు పండుతాయి. లేకపోతే పెట్టుబడి కూడా వృథా అవుతుంది. ఇప్పటికే బయ్యారం మండలంలో చెరువు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. నీరు విడుదల చేసే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో తాగునీటికి వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. చెరువులనే ఆధారంగా చేసుకొని ప్రతీ ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా సాగుచేశామని, పంటలకు సరిపడా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
నీటి విడుదలకు ఎల్‌నినో అడ్డు
సాక్షి, మహబూబాబాద్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవలేదు. అధికారులు ముందస్తు ప్రచారం నిర్వహించి ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. దీంతో సగం పంటలే సాగుచేసిన రైతులకు.. పంటలు పండుతాయో లేదో అనే భయం పట్టుకుంది. పెట్టుబడులు మీద పడుతాయని ఆందోళన చెందారు. అయితే రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశ కలిగింది. మరో పెద్దవర్షం కురిస్తే వానాకాలం పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులకు చేరిన నీరు..
జిల్లాలో మొన్నటి వరకు భారీ వర్షం కురవలేదు. చిరుజల్లులు, మోస్తరు వర్షాలే కురిశాయి. దీంతో గత ఏడాది వర్షాలకు వచ్చిన నీటి మట్టం కూడా అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లోకి నీరు చేరుకుంది. జిల్లాలో 1590 చెరువులు ఉన్నాయి. కాగా 25శాతం నీరు చేరినవి 398 చెరువులు, 50శాతం నీరు చేరినవి 723 చెరువులు, 75శాతం నీరు చేరినవి 273 చెరువులు ఉన్నాయి. అలాగే 190 చెరువులు వందశాతం నిండాయి. ప్రధానంగా కేసముద్రం, దంతాపల్లి, గార్ల, బయ్యారం, మహబూబాబాద్ మండలాల్లోని చెరువుల్లో ఎక్కువ మొత్తంలో నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు.
చెరువుల మత్తడి..
బయ్యారం: బయ్యారం మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టు, గౌరారం కట్టల్లోకి పూర్తి స్థాయి నీరు చేరడంతో మత్తడి దూకుతున్నాయి. ఆలస్యంగానైనా చెరువుల్లోకి నీరు చేరడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
భూగర్భజలాలు పెరుగుతాయని అన్నదాతల్లో ఆశ
చెరువుల్లోని నీటి విడుదలకు ఎల్‌నినో అడ్డంకి..
మరో భారీవర్షం కురిస్తేనే పంటలకు సరిపడా నీరు


