● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు: పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా, అభివృద్ధి పనులు వేగవంతమయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. తాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పార్టీలకతీతంగా కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


