సీడీపీఓలపై ఆర్థికభారం | - | Sakshi
Sakshi News home page

సీడీపీఓలపై ఆర్థికభారం

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

మహబూబాబాద్‌: జిల్లాలో 231 అంగన్‌వాడీ పోస్టులకు 3,063 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం ప్రతీ దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆరు కాపీలు ప్రింట్‌ తీసుకోవాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా సంక్షేమశాఖ పరిధిలో ఐదు ప్రాజెక్ట్‌లు ఉండగా ఒ క్కో సీడీపీఓపై సుమారు రూ.40,000 ఆర్థిక భారం పడుతుంది. కాగా, ఈనెల వేతనంలో సగం ప్రింట్‌లకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1,437అంగన్‌ వాడీ కేంద్రాలు..

జిల్లాలో 1,437 కేంద్రాలు ఉండగా.. 1,309 మంది టీచర్లు, 957మంది ఆయాలు, 49మంది సూపర్‌వైజర్లు మాత్రమే ఉన్నారు. టీచర్లు లేని సెంటర్లను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది.

231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

జిల్లాలో 101 టీచర్లు, 130 ఆయా పోస్టుల భర్తీకి గత నెల 24వ తేదీన నోటిఫికేషన్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

● డోర్నకల్‌ ప్రాజెక్ట్‌ (డోర్నకల్‌, గార్ల, కురవి, సీరోలు మండలాలు) పరిధిలో 16 టీచర్‌ పోస్టులు, 35 ఆయా పోస్టులు

● గూడూరు ప్రాజెక్ట్‌(గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు)పరిధిలో 15 టీచర్‌, 54 ఆయా పోస్టులు

● మానుకోట ప్రాజెక్ట్‌(మానుకోట, కేసముద్రం, బయ్యారం, ఇనుగుర్తి) పరిధిలో 28 టీచర్‌, 41 ఆయా పోస్టులు

● మరిపెడ ప్రాజెక్ట్‌(దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు) పరిధిలో 13 టీచర్‌ పోస్టులు

● తొర్రూరు ప్రాజెక్ట్‌ (తొర్రూరు, నెల్లికుదురు, పెద్దవంగర)పరిధిలో 29 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

3,063 దరఖాస్తులు..

గత నెల 25 నుంచి ఈనెల 3వ తేదీ వరకు ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల నిమిత్తం గడువు ఇచ్చారు. 231 పోస్టులకు గాను 3,063 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. 101 టీచర్‌ పోస్టులకు 2,172 దరఖాస్తులు, 130ఆయా పోస్టులకు 891 దరఖాస్తులు వచ్చాయి.

నేటి నుంచి వెరిఫికేషన్‌..

ఈనెల 7నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ శిరీష తెలిపారు. ఆయా మండలాలకు సంబంధించిన సీడీపీఓ కార్యాలయంలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అందుకు ముందుగా తేదీలను కూడా తెలియజేస్తారు. ఆ తేదీల ప్రకారం వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలన చేసుకోవాల్సి ఉంది.

ఆర్థిక భారం..

దరఖాస్తు చేసుకున్న ప్రతీ దరఖాస్తుదారువి ఆరు ప్రింట్‌లు సీడీపీఓలు తీసుకున్నారు. డీడబ్ల్యూఓ సెలవులో ఉండడంతో ప్రస్తుతం మానుకోట సీడీపీఓ శిరీషకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. మానుకోట, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు ప్రాజెక్ట్‌లకు రెగ్యులర్‌ సీడీపీఓలు ఉండగా.. గూడూరుకు సీడీపీఓ లేకపోవడంతో ఏసీడీఓకు బాధ్యతలు అప్పగించారు. కాగా ఆ ప్రింట్‌ల వల్ల ఒక్కో సీడీపీఓపై సుమారు రూ.40,000 భారం పడింది.

క్లియర్‌ కాని పాత బిల్లులు..

ఆశాఖలో పాత బిల్లులే క్లియర్‌ కాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్కో సీడీపీఓ రూ.2500 మాత్రమే బిల్లు పెట్టుకోవాల్సి ఉంటుందని సిబ్బంది తెలిపారు. బిల్లు క్లియర్‌ చేసినా.. రూ.37,500 నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తర్వాత ఫిజికల్‌ వెరిఫికేషన్‌, తర్వాత జీపీలో ఆ జాబితా ప్రదర్శన, ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. చివరగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

231 అంగన్‌వాడీ పోస్టులకు

3,063 అర్జీలు

ప్రతీ దరఖాస్తుకి ఆరు ప్రింట్‌లు అవసరం

ఒక్కో సీడీపీఓపై రూ.40వేల భారం

క్లియరెన్స్‌ కాని పాత బిల్లులు

నేటి నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల

వెరిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement