● ఆటో నడిపిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
కురవి: ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక, ఆటోలు నడుపుకోలేక, ఆదాయం రాక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఉసురు పోసుకుని కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోతుందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ శాపనార్థాలు పెట్టారు. మండలంలోని పెద్ద తండాలో ఆదివారం ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆమె ఆటోను స్వయంగా నడిపి నిరసన వ్యక్తం చేశారు. తండాలోని బొడ్రాయికి నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు. అనంతరం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారని, కనీసం వారికి బీమా సైతం కట్టడం లేదని తెలిపారు. ఆడవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితం పేరిట మగవాళ్లకు డబుల్ రేట్లు పెంచారని ఆరోపించారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాపాలన పేరిట ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారని, దగా చేస్తున్నారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బిందు, బోడ శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, సిరినాయక్ పాల్గొన్నారు.


