డిజైన్‌ మార్పు మాటలకేనా? | - | Sakshi
Sakshi News home page

డిజైన్‌ మార్పు మాటలకేనా?

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

డిజైన్‌ మారిస్తేనే మేలు

బయ్యారం: మండలంలోని వినోభానగర్‌ సమీపంలో వట్టేరు వాగుపై నిర్మించిన తులారాం(బీ.ఎన్‌.గుప్తా) ప్రాజెక్టు డిజైన్‌ మార్పుపై ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు వట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. డిజైన్‌ మార్పు చేస్తే జిల్లా పరిధిలోని బయ్యారం, మహబూబాబాద్‌ మండలాలతోపాటు కురవి, గార్ల, డోర్నకల్‌ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు తాగునీటితో పాటు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందించే వీలుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మహబూబాబాద్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బీ.ఎన్‌.గుప్తా అనేక పోరాటాలు చేశారు. అయితే బీ.ఎన్‌. గుప్తా మరణాంతరం 2002 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.3.80 కోట్ల నిధులతో మొదలుపెట్టగా 2005లో పూర్తయింది. ఎడమ కాల్వ ద్వారా బయ్యారం మండలంలోని వినోభానగర్‌, గౌరారం, బాలాజీపేట, తీత్రీ తండా, బాల్య తండా, చీన్య తండా, జగ్నా తండా, బండ్లకుంట గ్రామాల పరిధిలోని 2200 ఎకరాలకు, కుడికాల్వ ద్వారా బయ్యారం మండలంలోని లక్ష్మీనర్సింహాపురం, ఉప్పలపాడు, మహబూబాబాద్‌ మండలంలోని రంగశాయిపేట, జమాండ్లపల్లి, రెడ్యాల, నడివాడ, గడ్డిగూడెం గ్రామాల రైతులకు సాగునీరు, మహబుబాబాద్‌ పట్టణానికి మున్నేరు వాగుద్వారా తాగునీరు అందించేలా అంచనాలు వేశారు. మున్నేరు వాగులో తులారాం నీళ్లను వదలడం ద్వారా వాగు నుంచి కురవి, డోర్నకల్‌, గార్ల మండలాల రైతులకు తాగు, సాగు నీరందించవచ్చని అప్పట్లో అంచనాలు వేశారు. అయితే అధికారుల అంచనాలు సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చకపోవడంతో విలువైన నీరు వృథాగా మున్నేరులో కలుస్తోంది.

చెక్‌డ్యాంలా నిర్మించడంతో మారిన అంచనాలు..

బయ్యారం, మహబూబాబాద్‌ మండలాల పరిధిలో సుమారు 12 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు చివరకు చెక్‌డ్యాంగా మారింది. దీంతో రెండు వైపులా కాల్వలు నిర్మించే పరిస్థితి లేకుండా పోయింది. మొదటగా ఎడమ కాల్వ ద్వారా బయ్యారం మండలంలోని బండ్లకుంట వరకు నీరందించేలా కాల్వ తవ్వారు. అయితే తవ్విన కాల్వలో బాల్యా తండా నుంచి బండ్లకుంట వరకు పూడిపోగా వినోభానగర్‌, గౌరారం బాలాజీపేట గ్రామాల పరిధి వరకు ప్రస్తుతం కాల్వ ఆనవాళ్లు కనపడుతున్నాయి.

అమలుకాని హామీలు

తులారాం ప్రాజెక్టు అభివృద్ధిపై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు పలు హామీలు ఇచ్చారు. కానీ, అమలు చేయడంలో ఆసక్తి చూపడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ప్రాజెక్టు డిజైన్‌ మార్చడంతో పాటు కాల్వల మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అమలుకు నోచుకోని ప్రజాప్రతినిధుల హామీలు

అభివృద్ధి బాటపట్టని

తులారాం ప్రాజెక్టు

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

వట్టేరుపై ఉన్న తులారాం ప్రాజెక్టుకు వర్షాకాలంలో వరద ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక రోజంతా వర్షం పడితే ప్రాజెక్టు నిండి ఆ తర్వాత వృథాగా నీరంతా మున్నేరులో కలుస్తుంది. ప్రస్తుతం చెక్‌డ్యాంగా ఉన్న ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి పునఃనిర్మాణం చేస్తే జిల్లాకేంద్రానికి తాగునీటిని అందించడంతోపాటు పలు మండలాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement