నెల రోజులు గడిచినా
వెలువడని నివేదిక
మరో కమిటీ వేయాలని
ఆర్‌డీడీ నివేదించారు..
నెల రోజులైనా చర్యలు లేవు..
హన్మకొండ చౌరస్తా: ‘నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది ఐటీఐ అధికారుల తీరు. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఐటీఐ అధికా రులే దారి తప్పి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను మీరుతూ రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుతో నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. విచారణకు ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా నిజాలు బయటిపెట్టకుండా సదరు ఉద్యోగులను కాపాడుకునేందుకు ఉత్తుత్తి విచారణ చేపట్టి ఉన్నతాధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ సభలో పాల్గొనడంపై ఫిర్యాదు..
హైదరాబాద్‌లోని ఎంప్లాయ్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్‌లో ట్రెయినింగ్ ఆఫీసర్‌గా ఉన్న ఓంకార్ (ప్రస్తుతం మహబూబాబాద్ ఐటీఐ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు.), పెద్దపల్లి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ఫిబ్రవరి 02, 2025లో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు. విధి నిర్వహణలో కొనసాగుతూనే రాజకీయ సభలో పాల్గొనడంపై ఓ వ్యక్తి ఎంప్లాయ్‌మెంట్ డైరెక్టర్, గవర్నర్, ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎంప్లాయ్‌మెంట్ డైరెక్టర్ విచారణకు ఆదేశిస్తూ కమిటీని నియమించారు. డైరెక్టర్ ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 25న హైదరాబాద్ ఆర్‌డీడీ నర్సయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. మహబూబ్‌బాద్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఓంకార్, పెద్దపల్లి ట్రైనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్‌ను వరంగల్‌లోని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆఫీస్‌లో విచారించారు. కానీ, అందుకు సంబంధించిన నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందించ చర్య లో జాప్యం నెలకొనడంపై విమర్శలు వస్తున్నాయి.
ఐటీఐ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ ఆఫీసర్‌పై విచారణ
రాజకీయ సభలో పాల్గొన్నారంటూ ఫిర్యాదు
అధికారుల తీరుపై విమర్శలు
ఓంకార్, మల్లికార్జున్ లపై వచ్చిన ఫిర్యాదుపై డైరెక్టర్ ఆదేశాలతో జూన్ 25న విచారణ జరిగింది వాస్తవమే. విచారణ కమిటీ చైర్మన్‌గా హైదరాబాద్ ఆర్‌డీడీ నర్సయ్య, సభ్యుడిగా నేను ఉన్నాం. అయితే ఫిర్యాదు ఎదుర్కొంటున్న వారిద్దరు, నేను ఒక్కటే అసోసియేషన్‌కు చెందిన వారమని తెలిపాను. దీంతో ఆర్‌డీడీ నర్సయ్య మరో కమిటీ వేసి మరోసారి విచారణ చేయాలని ఎంప్లాయ్‌మెంట్ డైరెక్టర్‌కు నివేదించారు. తదుపతి కమిటీ విచారణ చేసే వరకు వేచిచూడాల్సిందే.
– చందర్, ప్రిన్సిపాల్ ఐటీఐ వరంగల్
విచారణ చేపట్టి నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ కమిటీ సభ్యుడిగా ఉన్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్.. తెలంగాణ టెక్నికల్ అసోసియేషన్‌లో బాధ్యుడు కాగా, అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు అధికారులు సైతం అదే అసోసియేషన్ బాధ్యులని తెలిసింది. సన్నిహితులు అయినందునే విచారణను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


