● అక్టోబర్ 10 నుంచి అమలు
కాజీపేట రూరల్: తిరుపతి నుంచి కరీంనగర్ (12761)కు వయా గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మీదుగా వెళ్లే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేళలో స్వల్ప మార్పులు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 08ః05 గంటలకు బయల్దేరే ఈ ఎక్స్‌ప్రెస్ రాత్రి 07ః50 గంటలకు బయల్దేరుతుందని దెలిపారు. తిరుపతి నుంచి 15 నిమిషాల ముందే బయల్దేరేలా సమయం మార్చినట్లు తెలిపారు. ఈ మార్పు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్వో స్పష్టం చేశారు.
అటవీశాఖ అధికారులకు పునుగు పిల్లి అప్పగింత
శాయంపేట : ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యుడు మారెపల్లి సునీల్ ఓ పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డుపై పునుగు పిల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పశువైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిపారు. పునుగు పిల్లికి మెరుగైన చికిత్స కోసం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కోటేశ్వర్ రావు, వాచర్ అశోక్ జిల్లా పశువైద్యశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సునీల్, వన్యప్రాణి ప్రేమికుడు సాయికృష్ణ పాల్గొన్నారు.
పాలకుర్తి యువకుడికి జాతీయ స్థాయి గౌరవం
● ‘స్టేట్ యూత్ అంబాసిడర్– టీబీ అడ్వకసీ ఫెలో’గా సందీప్ ఎంపిక
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకర్తి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎలమకంటి సందీప్ ప్రతిష్టాత్మక ‘స్టేట్ యూత్ అంబాసిడర్ –టీబీ అడ్వకసీ ఫెలోగా’ ఎంపికయ్యారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూనైట్ ఇండియా ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. సందీప్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులతో టీబీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిచడం, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖాతో సమన్వయం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో టీబీ నివారణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిచడం ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి. ఈ సందర్భంగా సందీప్ పాలకుర్తికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పలువురు అభినందించారు.


