● కలెక్టర్ స్నేహశబరీష్
కొత్తగూడ: వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని మైలారం గ్రామంలో పంట మార్పిడి చేసిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు వేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడితో రాబడి పొందవచ్చన్నారు. వరి, మొక్కజొన్న పంటలకు బదులు కూరగాయలు, వేరుశనగ, సోయాబీన్ లాంటి పంటలు సాగు చేసుకున్న రైతులను అభినందించారు. అనంతరం గాంధీనగర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మన గ్రోమోర్ సెంటర్‌ను తనిఖీ చేశారు. సెంటర్‌లో ఏయే ఎరువులు అందుబాటులో ఉన్నాయి, వాటి ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించడంలో నిర్వాహకులు చొరవ చూపాలని సూచించారు. యూరియా అందుబాటులో ఉందా అని అడుగగా.. పొగుళ్లపల్లి సొసైటీకి వెళ్లాలని జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర తెలిపారు. లారీ కిరాయి రావడం లేదని సొసైటీ నిర్వాహకులు యూరియా తెప్పించడం లేదని వివరించారు. మన జిల్లాలోనే ఈ సమస్య ఉందా.. ఇతర జిల్లాలో కూడా ఉందా అని కలెక్టర్ అడగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉందని డీఏఓ తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ రాజు, ఏఓ ఉదయ్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.


