న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్/గార్ల: మారుమూల తండాలో పుట్టారు. ఇంటర్, డిగ్రీ, వివిధ కోర్సులు పూర్తిచేసిన తండా యువత ఉద్యోగాలు రాలేదని చింత పడలేదు. ఉన్న కొద్దిపాటి భూమిలోనే బంగారం పండించాలని పట్టుబట్టారు. మూసపద్ధతిలో కాకుండా కాలానుగుణంగా పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో పంట చేతికి వచ్చేలా సాగు మొదలుపెట్టారు. బీర, కాకర, బోడ కాకరకాయ మొదలైన కూరగాయలు సాగుచేశారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్నప్పుడు పంట చేతికి వచ్చింది. ఇలా మూడేళ్లుగా ఎకరం భూమిలో ఆరు నెలల్లో అన్ని ఖర్చులు పోను రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు లాభాలు పొందుతూ.. ఇతర రైతులకు దర్శంగా నిలిచారు గార్ల మండలం బాలాజీ తండా వాసులు. ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం.
ఒక్కొక్కరుగా..
గార్ల మండలం బాలాజీతండాలో 90 కుటుంబాలు ఉంటాయి. తండాలో నివాసం ఉండేవారిలో ఎక్కువ మంది వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు. వీరి భూమి చదునుగా కాకుండా కొన్నిచోట్ల గుట్టలతో ఉంటుంది. అయితే గతంలో పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి సాగుచేసేవారు. పత్తి పంట సాగుచేసిన రైతులు అప్పుల పాలయ్యారు. మొక్కజొన్నను అడవి పందులు, కోతుల బారి నుంచి రక్షించడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో నలుగురు రైతులు తమకు ఉన్న భూమిలో అర ఎ కరం, ఎకరం మేరకు కూరగాయల సాగు చేసి లా భాలు పొందారు. దీంతో తండాలోని సగం మంది రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు.
వీరి రూటే.. సపరేట్..
గుట్టలు, కొండల మధ్య ఉన్న బాలాజీ తండాలో నీటి వనరులు అంతంత మాత్రమే. వర్షాలు కురిస్తేనే సమృద్ధిగా నీరు ఉంటుంది. లేకపోతే వేసి న బోర్లు సక్రమంగా పోయవు. కాగా, ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఒడిసిపట్టి సాగు చేపడుతున్నారు. ఇతర రైతులతో పాటు కూరగాయల సా గు చేశారు. అయితే పంట బాగా పండినా.. మార్కెట్‌లో ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన ఆ గ్రామ యువకులు జూన్‌లో కాకుండా మే నెలలోనే సాగు కు శ్రీకారం చుట్టారు. మండుటెండలో పంటలను కంటికి రెప్పలా కాపాడారు. ఉన్న కొద్దిపాటి నీటిని మొక్క మొక్కకూ పారించారు. 20 రోజుల నుంచి బీరకాయ పంట పండుతోంది. కాకర, బోడకాకర కాయలు కోతకు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో చేతికి వచ్చిన పంటలతో వారికి కాసుల వర్షం కురుస్తోంది. ఎకరం సాగుకు రూ. 50వేల మేరకు పెట్టుబడి పోతుంది. ఒక్క బీరకాయల మీదనే రూ.లక్ష మేరకు లాభం వస్తుందని, కాకర, బోడకాకర కాయలతో మరో రూ.లక్ష మేరకు వస్తాయని రైతులు ధైర్యంగా చెబుతున్నారు.
నేరుగా మార్కెట్‌కు..
బాలాజీ తండా రైతులు తమ పంటను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ప్రతీ రోజు క్వింటా నుంచి రెండు క్వింటాల మేరకు బీర, కాకర, బోడకాకర కాయల దిగుబడి వస్తుంది. మహబూబాబాద్, గార్ల, డోర్నకల్, ఇల్లెందు, కుర వి, కారేపల్లి, పండితాపురం గ్రామాల్లోని సంతల కు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద అమ్ముతున్నా రు. మార్కెట్ రేటు కంటే తక్కువకు, తాజా కూరగాయలు దొరకడంతో ప్రజలు తీసుకుంటున్నారు.
వేసవిలో మొక్కలు నాటిన
బాలాజీతండా రైతులు
కొద్దిపాటి నీటి వనరులను
ఒడిసిపట్టి పంటలకు జీవం
డిమాండ్ ఉన్న సమయంలో
పంట చేతికి..
ఎకరానికి రూ.1.50లక్షల మేరకు
లాభాలు


