ఉమ్మడి వరంగల్‌కు పోస్టులు..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, హానరేరియం, ఎంటీఎస్ ఉద్యోగాల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేడర్‌లలో పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఉమ్మడి వరంగల్‌కు పెద్దపీట వేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
భారీగా పోస్టుల కేటాయింపు..
ఉమ్మడి వరంగల్ జిల్లాల వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు వివిధ కేటగిరీల్లో సుమారు 564 పోస్టులను మంజూరు చేశారు. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, సాంకేతిక సిబ్బంది, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చారు.
● హనుమకొండకు 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, వరంగల్ జిల్లా కింద 40 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బందిని కేటాయించారు.
● ఎంజీఎం/కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 ప్రొఫెసర్లు, ఏసీ మెకానిక్, ఆడియాలజిస్ట్ తదితర పోస్టులు ఇచ్చారు.
● మహబూబాబాద్‌కు 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 35మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు.
● ములుగు జిల్లాకు 56 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏడుగురు ట్యూటర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర పోస్టులు ఇచ్చారు.
● జనగామకు15 మంది అసిస్టెంట్, 26 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కేటాయించారు.
● జయశంకర్ భూపాలపల్లికి 53 అసిస్టెంట్, 22 అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సాంకేతిక పోస్టులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
వేతనాలకూ భారీ వ్యయం..
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.1.25 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, సీనియర్ రెసిడెంట్లకు రూ.1,06,461, ట్యూటర్లకు రూ.55 వేల వరకు పారితోషికం చెల్లించనున్నారు. ఇతర అవుట్‌సోర్సింగ్, సాంకేతిక సిబ్బందికి సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు అందజేయనున్నారు. ఈ ఉద్యోగుల వేతనాల కోసం బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలు, రిమ్స్ ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన బడ్జెట్ హెడ్‌ల నుంచి ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో ఆదేశించింది. కాగా ఉమ్మడి వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆసుపత్రి, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల బోధన, వైద్య సేవలు కొనసాగేందుకు ఈ ఉత్తర్వులు మరింత కీలకంగా మారనున్నాయి.
డీఎంఈ పరిధిలో పోస్టుల
కొనసాగింపు... కొత్తగా కేటాయింపులు
బోధనాసుపత్రులు, మెడికల్ కాలేజీలకు భరోసా


