● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
హుస్సేన్‌నాయక్
నెహ్రూసెంటర్: భూముల కోసం, కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం, జేబులు నింపుకునే వారు కాకుండా.. ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఈసీఐఎల్, సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో అందజేసిన అత్యాధునిక అంబులెన్స్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేసే నాయకుడికి మనుగడ ఉంటుందన్నారు. గూడూరు, మహబూబాబాద్ ఆస్పత్రులకు అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిచేలా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో ఖాళీ పోస్టులు త్వరలో భర్తీకానున్నాయని చెప్పారు. అంబులెన్స్‌ను అందించిన ఈసీఐఎల్ సంస్థ బాధ్యులను ఆయన అభినందించారు. జిల్లాలో రూ.10కోట్లతో దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అభివృద్ధి పనుల కోసం తనవద్దకు రావాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఈసీఐఎల్ డైరెక్టర్ చక్రవర్తి, సీఎస్‌ఆర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు, సీఎస్‌ఆర్ డిప్యూటీ మేనేజర్ సునీల్‌కుమార్, జీఎంసీ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, డాక్టర్ వెంకట్రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


