మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీమన్నారాయణుడి ప్రీతికరమైన శనివారం రోజు తొలి ఏకాదశి రావడాన్ని భక్తులు విశేషంగా భావించారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అర్చకులు స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకరణ, అర్చన పూజలు జరిపారు. భక్తులు తమను చల్లంగా చూడాలని శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. కాగా, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి ఆలయంలో తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.


