● కలెక్టర్ స్నేహ శబరీష్
మరిపెడ రూరల్: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతు బాదావత్ వీరన్న–బుజ్జి దంపతుల వ్యవసాయ క్షేత్రంలో పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో పాటు పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై సూచనలు అందించాలని ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంట మార్పిడి విధానాన్ని ప్రతీ రైతు పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో పోషకాహార పంటల సాగును ప్రోత్సహించే నూతన ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని సూచించారు. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన నల్ల తామర పురుగును తట్టుకునే అర్క తేజస్వి మిరప విత్తనాల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. హెచ్‌ఆర్‌ఎస్ మల్యాల ప్రధాన శాస్త్రవేత్త ప్రశాంత్, డీఏఓ విజయచంద్ర, జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న, మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, కమిషనర్ నరేష్‌రెడ్డి, మరిపెడ వ్యవసాయ అధికారి బోడ వీరసింగ్, తహసీల్దార్ కృష్ణవేణి, సర్పంచ్ లచ్చుపతి, అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా సర్ ప్రక్రియ పూర్తిచేయాలి
మరిపెడ: అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎస్‌ఐఆర్ ఫారాలు ఆగస్టు 3లోపు సమర్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. మరిపెడలోని సర్ సవరణ డిజిటలైజేషన్ కేంద్రాన్ని, సాంఘిక సంక్షేమశాఖ బాలికల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, తిరిగి సేకరించాలన్నారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడారు. తరగతి గదులు, కిచెన్‌షెడ్, డైనింగ్‌హాల్, టాయిలెట్స్ పరిసరాలను పరిశీలించారు. మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, కౌన్సిలర్లు గంట్ల గౌతమ్‌రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.


