● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని, కేంద్రాల నిర్వాహక ఏజెన్సీలకు ప్రభుత్వం కమీషన్ చార్జీలు విడుదల చేసిందని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కమీషన్ చార్జీల చెక్కును సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఏజెన్సీలకు 70 శాతం కమీషన్ చార్జీలు రూ.4,96,75,172ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం సుమారు 46 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. యాసంగి సీజన్‌లో 3,62,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారన్నారు. దానిలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఏం నర్సింహారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


