సులభంగా డబ్బు సంపాదించాలని.. | - | Sakshi
Sakshi News home page

సులభంగా డబ్బు సంపాదించాలని..

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

వరంగల్‌ క్రైం : సులభంగా డబ్బు సంపాదించాలని శివారు ప్రాంతాల్లోని సెల్‌ టవర్ల బ్యాటరీలు దొంగతనం చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ముఠాలోని ఐదుగురిని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేసినట్లు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులనుంచి రూ.1.98 లక్షల విలువైన 144 సెల్‌ టవర్ల బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, ట్రాలీలు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్‌, బొంగరాల సుధాకర్‌, తన్నీరు శివాజీ, బీమనబోయిన నరసింహ, గడగోజు సురేష్‌ నిందితులుగా ఉన్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడైన గణేష్‌ (డ్రైవర్‌), మిగిలిన ఇద్దరు సుధాకర్‌, శివాజీకి జనరేటర్‌ మరమ్మతు, సెల్‌ టవర్‌ పనుల్లో పరిజ్ఞానం ఉండటంతో ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో సెల్‌ టవర్లకు వినియోగించే బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరు చోరీ చేసిన బ్యాటరీలను మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించగా వచ్చిన డబ్బుతో ముగ్గురు జల్సాలు చేసినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు రాత్రివేళ చెరువుల్లో చేపల చోరీలకు పాల్పడే మిగతా సభ్యులు తోడవడంతో బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలమైన సెల్‌ టవర్లను గుర్తించి దొంగతనం చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులు వరంగల్‌ కమిషనరేట్‌తోపాటు యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్‌ టవర్‌ బ్యాటరీలు చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. మార్చి 3న హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనంతసాగర్‌ సెల్‌ టవర్‌ నుంచి 48 బ్యాటరీలు చోరీకి గురికావడంతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు శుకవ్రారం తెల్లవారుజామున చోరీ సొత్తును విక్రయించేందుకు దేవన్నపేట శివారులో ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ గేట్‌ వద్ద వేచి ఉన్న ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.

అధికారులకు అభినందనలు

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌ రెడ్డి, హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, ఎస్సైలు దేవేందర్‌, సుజీత్‌ రెడ్డి, కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్‌, బావ్‌సింగ్‌, వెంకట స్వామి, భరత్‌తోపాటు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

సెల్‌ టవర్ల బ్యాటరీలు చోరీ

నిందితుల అరెస్ట్‌, సొత్తు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement