బైక్‌లు ఢీకొని.. ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీకొని.. ఆరుగురికి గాయాలు

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

నలుగురి పరిస్థితి విషమం

కురవి : ద్విచక్రవాహనాలు (స్కూటీ, బైక్‌) ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీరోలు–కాంపల్లి మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇమ్మడి సిద్ధు, వినోద్‌ బైక్‌పై మరిపెడకు వెళ్తున్నారు. వినోద్‌కు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ రావడంతో హైదరాబాద్‌కు పంపించేందుకు బైక్‌పై వస్తున్నట్లు సమాచారం. సీరోలు మండలం రేకుల తండా గ్రామ పరిధిలోని రూప్లా తండాకు చెందిన తేజావత్‌ రెడ్డి, బాదావత్‌ చరణ్‌ స్కూటీపై రేకుల తండాలోని తేజావత్‌ నాగమణి, చరితను తీసుకొని కాంపల్లి వైపు వస్తున్నారు. ఈక్రమంలో కాంపల్లి వైపు వస్తున్న సోదరుల బైక్‌ను స్కూటీపై వెళ్తున్న వీరు ఢీకొట్టారు. దీంతో రెండు వాహనాలు కిందపడిపోవడంతో తేజావత్‌ రెడ్డి, బాదావత్‌ చరణ్‌, తేజావత్‌ నాగమణి, చరితతో పాటు సిద్ధు, వినోద్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మానుకోటలోని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. బాదావత్‌ చరణ్‌, తేజావత్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అలాగే మహబూబాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్మడి సిద్ధు, వినోద్‌ పరిస్థితి బాగా లేకపోవడంతో వరంగల్‌కు తరలించారు. సీరోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గార్ల నుంచి వస్తున్న వారిలో ఒకరు హెల్మెట్‌ ధరించి ఉండగా ప్రమాదంలో రోడ్డు పక్కన పడిపోయింది. వేరే వాహనంపై ఉన్న నలుగురిలో ఎవరూ హెల్మెట్‌ పెట్టుకోలేదని తెలిసింది. కాంపల్లి–సీరోలు మధ్య ఉన్న రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీరోలు పోలీసులు తెలిపారు.

అవగాహన కల్పించినా.. మార్పు శూన్యం

ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని జిల్లా పోలీసులు ఎంతో ప్రచారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవగాహన కల్పించి హెల్మెట్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయినా వాహనాలు నడిపే సమయంలో మరిచిపోయి ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మార్పు రాకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement