మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ ఎన్.అంజలి శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మానుకోట మున్సిపల్ పరిధిలోని శనిగపురం గ్రామం నుంచి మండలంలోని సోమ్లతండా గ్రామానికి వెళ్లే దారిలో సీసీఎస్ సీఐ హథీరాం, ఎస్సై కుష్ కుమార్, రూరల్ ఎస్సై వి.దీపిక, పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై ముగ్గురు యువకులు వస్తుండగా పోలీసులు ఆపి విచారించారు. కాగా వారి వద్ద రూ.2.92 లక్షల విలువైన 5.840 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. కురవి మండలంలోని కంచర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పవన్, నారాయణపురం గ్రామానికి చెందిన గుగులోత్ వినోద్ గంజాయిని శనిగపురం శివారు వీరారం తండాకు చెందిన బాదావత్ ప్రశాంత్, మానుకోట మండలంలోని దామ్యతండా జీపీ పరిధిలోని తోకబోడు తండాకు చెందిన నునావత్ రవీందర్, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామ శివారు తూకహాము తండాకు చెందిన మాలోత్ సందీప్‌నకు విక్రయించారు. వారు గంజాయిని అధిక ధరకు విక్రయించేందుకు జిల్లా కేంద్రానికి తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై దీపిక ఫిర్యాదు చేయగా రూరల్ రెండో ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేశారు. పవన్, వినోద్ పరారీలో ఉండగా ప్రశాంత్, రవీందర్, సంతోష్‌ను రిమాండ్‌కు తరలించనున్నట్లు రూరల్ సీఐ అంజలి తెలిపారు.


