మార్పునకు ప్రయత్నించండి | - | Sakshi
Sakshi News home page

మార్పునకు ప్రయత్నించండి

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

కొత్తపేటలో సీసీ కెమెరాలను

ప్రారంభించిన ఎస్పీ శబరీష్‌

బయ్యారం: గ్రామాలు, పట్టణాలను ప్రశాంత నిలయాలుగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో గురువారం 24 సీసీ కెమెరాల ప్రారంభంతో పాటు హెల్మెట్‌తో మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని పలు పంచాయతీల్లో హెల్మెట్‌ ధరించాలని గ్రామసభల్లో తీర్మానం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇదేవిధంగా గంజాయి నిర్మూలనకు గ్రామపంచాయతీలు వేదిక కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణం విలువైనదని, హెల్మెట్‌ లేకుండా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి తాగినట్లు అనుమానం వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు భవిష్యత్‌లో మరొకరు గంజాయి బారిన పడకుండా తమశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. పంచాయతీ పరిధి లో 24 చోట్ల సీసీ కెమెరాలను పెట్టించిన సర్పంచ్‌ ప్రవీణ్‌నాయక్‌ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌, ఎస్సై తిరుపతి, సర్పంచ్‌ ప్రవీణ్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి సమాచారం ఇవ్వండి

మహబూబాబాద్‌ రూరల్‌: యువత ఆరోగ్యం, భద్రత, భవిష్యత్‌ను కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ శబరీష్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ దుర్వినియోగం ఒక తీవ్రమైన సామాజిక సమస్య అని, ఇది నిశ్శబ్దంగా యువత జీవితాలను నాశనం చేస్తూ కుటుంబాలను బలహీనపరుస్తుందన్నారు. గంజాయి లాంటి మహమ్మారిని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గంజాయి వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల గురించి విశ్వసనీయ సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల వరకు బహుమతి ఇస్తామని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. 87126 56999 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement