పే స్లిప్‌లో చూపని ఓటీ వివరాలు
హన్మకొండ: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు వరంగల్ రీజియన్ అధికారులు ఓవర్ టైమ్ (ఓటీ) విధులకు సరిగా చెల్లింపులు చేయకుండా ఆర్థిక నష్టం కలిగించారు. నిద్రహారాలు మాని విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు మొండిచేయి చూపారు. శ్రమకు సరైన చెల్లింపులు చేయకుండా దోపిడీకి పాల్పడ్డారు. మేడారం జాతరంటేనే మానసికంగా, శారీరకంగా శ్రమించాల్సి ఉంటుంది. సమయం అనేది లేకుండా విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ఆర్థికంగా దెబ్బకొట్టారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
రోజుకు 12 గంటలు పని..
ఫిబ్రవరి చివరలో జరిగిన మేడా రం మహాజాతరలో ఆర్టీసీ ఉద్యోగులు 6 నుంచి 8 రోజుల పాటు రోజుకు 12 గంటలు పని చేశారు. రోజుకు 8 గంట లు పని చేయాల్సి ఉండగా 12 గంటలు పని చేశారు. ఈ లెక్కన చేసినా ప్రతీ రోజు నాలుగు గంటలు ఓటీ చెల్లించాలి. అయితే ఇక్కడ కొందరు అధికారులు యాజమాన్యం మెప్పు కోసం ఖర్చులు తగ్గింపు చూపడానికి అత్యుత్సాహం చూపారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. యాజమాన్యం మెప్పు కోసం ఉద్యోగుల పొట్ట కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నచ్చిన లెక్కలు వేసుకున్న
రీజినల్ ఆఫీస్ అధికారులు..
రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, ఇతర ఉద్యోగులు మేడారం జాతరలో విధులు నిర్వర్తించారు. సరైన విశ్రాంతి గదులు, భోజనం లేకపోయినా, దోమల బెడద వంటి సమస్యలను ఎదుర్కొని సంస్థ కోసం పని చేస్తే తమకు ఆర్థికంగా ఎలా నష్టం చేస్తారని ఉద్యోగులు నిలదీస్తున్నారు. డిపో మేనేజర్లు ఉద్యోగి వారీగా పని చేసిన రోజులు, ఓటీ వివరాలు పక్కాగా పంపినా రీజినల్ కార్యాలయం అధికారులు వీటిని తోసిరాజని వారికి నచ్చిన లెక్కలు వేసుకుని నిండా ముంచారని ఉద్యోగులు బాధపడుతున్నారు. 7 నుంచి 8 రోజులకు 28 నుంచి 32 గంటల ఓటీకి మూడు నుంచి నాలుగు రోజులకు 12 నుంచి 16 గంటల ఓటీ మాత్రమే చెల్లించారని ఉద్యోగులు వివరించారు. మరికొందరికి భారీగా కోతలు విధించారని వాపోయారు.
మేడారం జాతరలో ఓవర్ టైమ్‌కు సరిగ్గా చేయని చెల్లింపులు
ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారుల శ్రమ దోపిడీ
నిద్రాహారాలు మాని పని చేసిన
ఉద్యోగులకు చెల్లింపుల్లో కోతలు
భగ్గుమంటున్న ఉద్యోగులు
జాతర అడ్వాన్‌్స్‌గా ఒక్కో కార్మికుడికి రూ.5,000 చెల్లించగా, ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నట్లు ఎంప్లాయి యాప్‌లోని పే స్లిప్‌లో చూపించారని, కానీ ఓటీ వివరాలు మాత్రం అందులో పేర్కొనలేదని ఉద్యోగులు తెలిపారు. ఓటీ వివరాలు పే స్లిప్‌లు చూపిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతుందనే భావించే అధికారులు ఓటీ వివరాలు చూపించలేదని తెలిపారు. ఇప్పటికై నా ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వం స్పందించిన ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా రావాల్సిన ఓటీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.


