జనగామ: జనగామ ఎంసీహెచ్‌లో పసికందు అపహరణకు యత్నించి పట్ట్టుబడిన మహిళ తాళ్లపల్లి జ్యోతి అలియాస్ శాగ జ్యోతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజుతో జ్యోతికి వివాహం జరగ్గా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2021లో రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. 2022లో శాగ సురేశ్‌తో జ్యోతి రెండో వివాహం చేసుకుంది. సురేష్‌కు మొదటి భార్య ద్వారా ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గత ఆగస్టులో జ్యోతి గర్భవతి కావడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. లింగనిర్ధారణలో మళ్లీ ఆడశిశువు పుడుతుందని తేలడంతో భయంతో ఈ విషయం భర్తకు, తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా జ్యోతి గర్భస్రావం చేసుకుంది. కానీ, తన భర్తను నమ్మించడానికి, కుటుంబానికి వారసుడిగా మగబిడ్డను చూపించాలనే ఉద్దేశంతో శిశువును అపహరించాలని ఆలోచించింది. ఈక్రమంలో గతంలో జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లినప్పుడు అక్కడి రద్దీని గమనించి సులభంగా శిశువును తీసుకెళ్లవచ్చని భావించింది. ఈ నెల8వ తేదీన సాయంత్రం జ్యోతి ఎంసీహెచ్‌లోని పిల్లల వార్డులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఓ బాబు ఏడుస్తుండడాన్ని గమనించిన జ్యోతి డైపర్ మార్చాలంంటూ సెక్యురిటీ గార్డును నమ్మించి ఎస్‌ఎన్‌సీయూ వార్డులోకి వెళ్లింది. శిశువుకు ఫీడింగ్ ఇస్తానని చెప్పి ఆ బాబును చేతిలోకి తీసుకుని, ఓ ఆటోలో జనగామ వైపు బయల్దేరగా, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా మారడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆమెను వెంటాడి పట్టుకున్నారు. అనంతరం బిడ్డను సురక్షితంగా చంపక్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్యోతి వైద్య పరీక్షలు చేయించుకోగా ఆడశిశువు పుడుతుందని తేలినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ స్కానింగ్ సెంటర్ ఎక్కడ? అనే విషయమై ఆమె నోరు మెదపలేదు. దీంతో జ్యోతిని రిమాండ్ చేసిన పోలీసులు, సమగ్ర విచారణ కోసం తిరిగి కస్టడీకి కోరారు. జనగామలో స్కానింగ్ తీశారా లేక ఇంకా ఎక్కడైనా చేయించారా? అన్న సంగతి విచారణలో తేలనుందని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు భరత్, రతీశ్, మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
పసికందును ఎత్తుకెళ్లేందుకు యత్నించిన కేసులో మహిళ రిమాండ్
వివరాలు వెల్లడించిన జనగామ ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్


