గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని మున్నేరు వాగు నుంచి రూ.204 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం కోసం చేపట్టనున్న సర్వేను మంగళవారం 200 మంది పోలీసుల పహారా మధ్య ప్రారంభించారు. కాగా, ఈ ప్రాంతం నీటిని ఇక్కడికి ఇవ్వకుండా పాలేరుకు తరలిస్తే ఊరుకోబోమని రైతులు, మున్నేరు జలసాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే వీరిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. కాగా, మండలంలోని దుబ్బగూడెం సమీపంలోని పాకాల ఏటి నుంచి 140 మీటర్ల వెడల్పుతో కాల్వ వెళ్తుండడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ నీళ్లు తమ భూములకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తన నియోజకవర్గ రైతుల కోసం పాలేరు చెరువుకు నీరును తరలించడంపై మండిపడ్డారు.
నాయకులను విడుదల చేయాలంటూ ధర్నా..
మున్నేరు జలసాధన కమిటీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గార్లలో అఖిలపక్ష నాయకులు, రైతులు, స్థానికులు ధర్నా చేపట్టారు. అనంతరం పీఎస్‌కు వెళ్లి పోలీసులను వేడుకున్నా జలసాధన కమిటీ నాయకులను రాత్రి వరకు విడిచి పెట్టేది లేదని చెప్పారు. దీంతో పోలీసులు, అఖిలపక్ష నాయకుల మధ్య కాసేపు వా గ్వాదాలు చోటుచేసుకున్నాయి. కాగా, మున్నేరు జ లసాధన కమిటీ సభ్యుల్లో ఒకరైన జంపాల విశ్వ పీ ఎస్‌లో మౌనదీక్ష చేపట్టాడు. ఉదయం నుంచి ఏమి తినకుండా ఉండడంతో మధ్యాహ్నం కళ్లు తిరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే పోలీసులు సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు.
భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు..
మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ కోసం రెవెన్యూ అధికారులు తమ భూముల్లో సర్వే చేసినా ఇచ్చేది లేదని గిరిజన, గిరిజనేతర రైతులు పేర్కొంటున్నారు. ఎక్కడో ఉన్న పాలేరు రైతుల స్వలాభం కోసం తమ భూములు ఎందుకు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా
వ్యవహరిస్తున్న ప్రభుత్వం..
గార్ల సమీపంలో లింక్ కెనాల్ నిర్మాణ సర్వే పోలీసుల పహారా మధ్య చేయడం, అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్‌లు చేయడాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. లింక్ కెనాల్ భూసర్వే విషయంలో రైతులకు ఇష్టం లేకున్నా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అఖిలపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని, లింక్ కెనాల్ సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు.
కొనసాగుతున్న మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ సర్వే
మున్నేరు జలసాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్ట్
సర్వే ప్రాంతంలో 200మంది పోలీసుల మోహరింపు
అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని
అఖిలపక్ష నాయకుల ఆందోళన
తమ భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు


