హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయాన్ని బుధవారం ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్ మానవేంద్రనాఽథ్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘనంగా స్వాగతించారు. న్యాయమూర్తి ముందుగా ఆదిశంకరులు, వల్లభగణపతిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంట వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన జన్మదినం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజుకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. టీఎన్‌జీఓ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, యూనియన్ నాయకులు, కార్పొరేటర్ జన్ను షీబారాణి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


