కోటపై కాంగ్రెస్‌ జెండా..? | - | Sakshi
Sakshi News home page

కోటపై కాంగ్రెస్‌ జెండా..?

Feb 16 2026 8:24 AM | Updated on Feb 16 2026 8:24 AM

కోటపై

కోటపై కాంగ్రెస్‌ జెండా..?

కాంగ్రెస్‌ గూటికి చేరిన స్వతంత్రులు

మహబూబాబాద్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా గుగులోత్‌ జ్యోతి?

చివరి వరకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నం

మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో మానుకోటలో ప్రధాన పార్టీలకు మెజార్టీ రాలేదు. దీంతో చైర్మన్‌ పీఠం కోసం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో నలుగురు స్వతంత్రుల చేరికతో చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది.

హంగ్‌ ఫలితాలతో పరేషాన్‌

మానుకోటలో 36 వార్డులుండగా కాంగ్రెస్‌ 13 వార్డుల్లో, బీఆర్‌ఎస్‌ 11, సీపీఐ 3, సీపీఎం 3, బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఐదు వార్డుల్లో విజయంసాధించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఎం కలిసి పోటీ చేయగా వారికి 16 సీట్లు, బీఆర్‌ఎస్‌ సీపీఐ పొత్తుతో 14 సీట్లు సాధించాయి. మూడో వార్డు నుంచి కె.రజిత బీఆర్‌ఎస్‌ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. చైర్మన్‌ ఎన్నికకు సరిపడా స్థానాలు ప్రధాన పార్టీలకు రాకపోవడంతో స్వతంత్రులు కీలకమయ్యారు. వీరిలో గుగులోత్‌ జ్యోతి, కాటా భాస్కర్‌, బోల్లు రాజు, గాడిపెల్లి లావణ్య కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం. కాటా భాస్కర్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు ఫొటోలు బయటకొచ్చాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌, సీపీఎం 16 సీట్లు కలిగి ఉండగా.. స్వతంత్రులు నలుగురితోవారి సంఖ్య 20కి చేరింది. ఎమ్మెల్యే మురళీనాయక్‌ ఓటుతో వారికి 21 ఓట్లు ఉన్నాయి. దీంతో చైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెస్‌కు చైర్మన్‌.. సీపీఎంకు వైస్‌ చైర్మన్‌

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చైర్మన్‌ ప్రతిపాదిత అభ్యర్థి మూడు బాలు చౌహన్‌ ఓడిపోయారు. దీంతో స్వతంత్రంగా గెలిచిన గుగులోత్‌ జ్యోతిని కాంగ్రెస్‌లో చేర్చుకుని చైర్మన్‌గా, పొత్తులో భాగంగా సీపీఎంకు చెందిన సూర్నపు సోమయ్యకు వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. 8వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్‌ తరఫున గెలిచిన బానోత్‌ పార్వతికి చైర్మన్‌ పదవి ఇవ్వాలని ఎంపీ వర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నేడు(సోమవారం) కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుందని కమిషనర్‌ రాజేశ్వర్‌ ఆదివారం తెలిపారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ఉదయం 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గెజిటెడ్‌ అధికారిగా ఆర్డీఓ కృష్ణవేణి వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మానుకోటలో ఎక్స్‌ అఫీషియో ఓటును వేయనున్నారు. కార్యాలయం ఎదుట పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మాజీ ఎమ్మెల్యే యత్నాలు..

20వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కుమార్తె తేజస్వి విజయం సాధించడంతో చైర్‌పర్సన్‌ చేయాలని శంకర్‌నాయక్‌ యత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు 11 సీట్లు, సీపీఐకి 3 సీట్లు, 3వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలిచిన రజితతో కలిపి 15 ఓట్లు ఉన్నాయి. 26వ వార్డు నుంచి బీజేపీ తరఫున గెలిచిన మాలోత్‌ శ్రీదేవి మద్దతు కూడా కోరినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఓటుతో వీరిబలం 17కు చేరుతుంది. ఇక స్వతంత్రులు నలుగురు కాంగ్రెస్‌ గూటీలో ఉన్నా ఎన్నిక సమయంలో వారిలో ఇద్దరైనా తమకు మద్దుతు తెలియజేస్తారనే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌కు చైర్మన్‌ స్థానం దక్కితే సీపీఐకి వైస్‌ చైర్మన్‌ ఇచ్చే అవకాశం ఉంది.

డోర్నకల్‌: మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం జరగనున్న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌తో కలిసి ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ మొత్తం 15 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థులు 11 స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ 4 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఆదివారం రాత్రి వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

నేడు ప్రమాణస్వీకారం

కేసముద్రం: నేడు కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 16 వార్డులకు కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌కు 8 స్థానాలు ఉన్నాయి. దీంతో హంగ్‌ ఏర్పడింది. సోమవారం జరగనున్న ప్రమాణస్వీకారంలో భాగంగా చైర్మన్‌ ఎంపిక ఉత్కంఠతకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఎంపీ బలరాం నాయక్‌ ఎక్స్‌అఫీషియో ఓటును ఇక్కడ నమోదు చేసుకున్నట్లు కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

డ్రా పద్ధతిలో..

తొర్రూరు రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు, బీఆర్‌ఎస్‌ పార్టీ 9 సీట్లు గెలుపొందాయి. మెజార్టీ కౌన్సిలర్లను సాధించిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కే అవకాశం ఉండగా, ఓటింగ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌ అఫీషియోలుగా పాల్గొంటే కాంగ్రెస్‌ పార్టీకి సైతం 9 ఓట్లు ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండాలనే నిబంధన విధించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు 9 చొప్పున ఓట్లు రానుండడంతో చైర్మన, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక డ్రా పద్ధతిలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రెండు పార్టీల నాయకులు ఒకరిద్దరు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

కోటపై కాంగ్రెస్‌ జెండా..? 1
1/1

కోటపై కాంగ్రెస్‌ జెండా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement