సమస్యలతో స్వాగతం | - | Sakshi
Sakshi News home page

సమస్యలతో స్వాగతం

Feb 16 2026 8:24 AM | Updated on Feb 16 2026 8:24 AM

సమస్యలతో స్వాగతం

సమస్యలతో స్వాగతం

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ రెండో పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు నూతన పాలకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు.

వేధిస్తున్న తాగునీటి సమస్య..

మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిత్యం తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్లు, అమృత్‌ పథకం కోసం పైపులైన్‌ ఏర్పాట్ల పనులతో పలు వీధుల్లో పైప్‌లైన్లు పగిలి రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

అస్తవ్యస్తంగా రోడ్లు..

అమృత్‌ పథకంతోపాటు సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం పలు వీధుల్లో తవ్వకాలు జరపడంతో రహదారులు ధ్వంసమయ్యాయి. నెలల తరబడి పనులు జరుగుతుండటం, పలు వీధుల్లో పనులను నిలిపివేయంతో ధ్వంసమైన రోడ్లతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే జెడ్పీ స్కూల్‌, టెలీఫోన్‌ ఎక్చేంజ్‌ రోడ్డులో తవ్వకాలతో రోడ్డు ధ్వంసం కావడంతో మూడు నెలలుగా స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు.

పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు..

పలు వీధుల్లో పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరణ వాహనాలు రోజుల తరబడి వీధుల్లోకి రాకపోవడంతో ఇళ్లతోపాటు వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. చెత్త సేకరణ వాహనాలు నిత్యం మరమ్మతులకు గురి కావడం, సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది కొరతతో వీధుల్లో సకాలంలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

తప్పని ట్రాఫిక్‌ తిప్పలు..

మెయిన్‌ రోడ్డు, గాంధీసెంటర్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై తోపుడు బండ్లు, కూరగాయాలు, పండ్ల దుకాణాలను ఏర్పాటు చేయడంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు డ్రెయినేజీలతోపాటు రోడ్లను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడం, వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయల మార్కెట్‌ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు.

అభివృద్ది పనులకు మోక్షం లభిస్తుందా?

గతంలో రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇతర నిధులతో చేపట్టిన పనులు పలు కారణాలతో నిలిచాయి. కూరగాయల మార్కెట్‌ భవనం, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు, శ్మశానవాటిక పనులు, గిరిజన భవనం, డంపింగ్‌ యార్డు ఏర్పాటు, మోడల్‌ మార్కెట్‌ భవనం పనులు, మైనారిటీ మినీ ఫంక్షన్‌ హాలు వంటి మధ్యలో ఆగిన పనులకు మోక్షం లభిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

డోర్నకల్‌ మున్సిపాలిటీలో సమస్య తిష్ట

నేడు మున్సిపాలిటీ పాలకవర్గం

ప్రమాణ స్వీకారం

నిత్యం తాగునీటి సమస్యలు

అస్తవ్యస్తంగా రహదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement