నేడే మున్సిపోల్
పోలింగ్ సామగ్రి పంపిణీ
● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
● కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
సామగ్రితో
పోలింగ్ కేంద్రాలకు
వెళ్తున్న సిబ్బంది
సాక్షి,మహబూబాబాద్/మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈమేరకు మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు. కాగా, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మానుకోట, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉదయం 7గంటల నుంచి షురూ..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఐదు గంటల లోపు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు ఓటర్ స్లిప్‌తో పాటు ఆధార్‌కార్డు లేదా ఓటర్ కార్డు తీసుకెళ్లాలని ప్రచారం చేశారు. ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశారు.
జీడీసీలో పంపిణీ..
మానుకోట మున్సిపాలిటీ పరిధి 36వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. 12 కౌంటర్లు ఏర్పాటు చేసి 12 మంది ఆర్వోలు, 12 మంది ఏఆర్వోలతో పాటు అదనంగా 20 శాతం ఆర్వో, ఏఆర్వోల ఆధ్వర్యంలో సిబ్బందికి సామగ్రి అందజేశారు. 88పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతీ పీఎస్‌కు రెండు బ్యాలెట్ బాక్స్‌లు కేటాయించారు. ప్రతీ పీఎస్‌కు ఒక పీఓ, ఒక ఏపీఓతో పాటు ముగ్గురు ఓపీఓలు మొత్తం ఐదుగురిని కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. 8 రూట్లు ఏర్పాటు చేశారు. ఒక అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్‌తో పాటు 88 మంది విధులు నిర్వర్తిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. కాగా, మున్సిపాలిటీలో ఆరు సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, మేనేజర్ శ్రీధర్, మాస్టర్ ట్రైనర్ రాములు తదితరులు పాల్గొన్నారు.
నేడే మున్సిపోల్
నేడే మున్సిపోల్


