ఓట్ల వేట..
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రధాన ఘట్టం పోలింగ్ బుధవారం జరగనుంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల పరిధిలోని సగం వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు తీవ్ర పోటీ నెలకొంది. కాగా, ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం చేసిన ప్రచారం మరోఎత్తుగా ఉంటుంది. చివరి నిమిషంలో ఓటరు మనసు తమవైపు తిప్పుకునేలా అభ్యర్థులు, నాయకులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో 98 వార్డులు ఉండగా.. 50కిపైగా వార్డుల్లో పోటీ పోటీగా ప్రచారం సాగింది. అయితే ముందుగా పెట్టుకున్న పొత్తులు వికటించడం.. తర్వాత అభ్యర్థుల ముమ్మరంగా ప్రచారం చేయడం వంటి సంఘటనలు ఉన్నాయి. ఇందులో కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య ఎక్కువ పోటీ నెలకొంది. అదే విధంగా కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులతో ఆ పార్టీ రెబల్స్ తీవ్ర పోటీ పడుతున్నారు. మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ రెబల్స్ మధ్య పోటీ ఉంది. అయితే చివరి నిమిషంలో పోటీలో వెనకబడిన అభ్యర్థులను గట్టిపోటీ ఎదుర్కొంటున్న వారు బతిమిలాడడం.. ప్రచారం విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముమ్మర ప్రచారం చేసిన అభ్యర్థులకు చివరి వరకు ఓటరుకు పంచేందుకు డబ్బులు చేతికి రాకపోవడం, పలువురిని పార్టీ పెద్దలు చిన్నచూపు చూడడంలో ఏమీ చే యలేక చేతులు ఎత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒంటరిగా ప్రచారం..
వారం రోజులుగా ముమ్మర ప్రచారం చేసిన నాయకులు గడువు ముగియడంతో మంగళవారం అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఓటర్ల బంధువులు, కుల సంఘాల పెద్దలను వెంట తీసుకొని వెళ్లి ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుల వివరాలు, గతంలో ఓడిపోయిన సంఘటనలు, పోటీలో గెలిస్తే అనుకూలించే అంశాలు చెబుతున్నారు. ప్రధానంగా చైర్మన్ రేస్‌లో ఉన్నవారు. గెలిస్తే చైర్మన్ అవుతాను. మీ పనులు చేసిపెట్టే అవకాశం ఉంటుందని బతిమిలాడుతున్నారు.
ఎత్తులు..పైఎత్తులు..
గెలుపోటమలు నిర్ధారించే ఓట్లు తక్కువ సంఖ్యలో ఉంటాయనే సంకేతాలు రావడంతో.. ప్రతీ ఓటు కీలకంగా మారింది. నాయకులు డబ్బులే ప్రధానంగా భావించి ఓటు వేసే వార్డులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఆయా కాలనీల్లోని యువతకు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ పడి ఓటుకు రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు పంపిణీ చేశారు. అయితే అందరూ సమానంగా డబ్బులు ఇస్తే ఓటరు ఏం చేస్తారో అని తెలుసుకొని కొందరు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం అదనంగా డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. డబ్బులే కాకుండా మగవారికి డ్రస్‌లు, మహిళలలకు చీరల పంపిణీ ముమ్మరం చేశారు. మరికొన్ని చోట్ల అయితే ఓటుకు రూ.5వేల నుంచి రూ. 10వేల వరకు కూడా ఇచ్చేందుకు వెనకాడేది లేదన్నట్లు తమ అనుచరులను ఓటరు వద్దకు పంపి డబ్బుల పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చివరి ప్రయత్నంలో అన్ని పార్టీల నాయకులు
ఒంటరిగా ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థన
ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేసి తాయిలాలు
ఓట్ల వేట..


