టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, హెచ్‌ఎంలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా గిరిజనశాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికలక ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశీరాంనాయక్ మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక దశ అన్నారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకొని అంకితభావంతో పనిచేయాలన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు పాఠశాలలకు వచ్చేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో టెన్త్ క్లాస్ ఇంటర్నల్ పరీక్షల మార్కుల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత, విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేశామని డీఈఓ రాజేశ్వర్ మంగళవారం తెలిపారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు ఇంటర్నల్ మార్కుల బృందాలకు కీలకు సూచనలు అందజేస్తారని, అన్ని పాఠశాలల్లో సమాన ప్రమాణాలు పాటించాలన్నారు. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు పాఠశాలలను సందర్శిస్తారని, ప్రతీ బృందంలో ఒకరు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు విషయ నిపుణులు ఉంటారన్నారు. జిల్లాలో అన్ని మండలాల పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కుల పరిశీలనను పరిపూర్ణంగా పూర్తి చేసి తుది నివేదికను సమయానికి సమర్పించాలన్నారు.
‘స్కిల్‌డిజైర్’తో కేయూ ఎంఓయూ
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని స్కిల్‌డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్‌డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం, నైపుణ్యాలను అందించడం, ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పరస్పర జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడం ఎంఓయూ ఉద్దేశం అని రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో సైన్స్‌డీన్ జి.హనుమంతు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు.
పోలీసుల సేవలు అభినందనీయం
ములుగు రూరల్: మేడారం మహాజాతర విజయవంతంలో పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో మంగళవారం అధికారులకు, సిబ్బందికి బడాఖాన ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. రాష్ట్ర బెటాలియన్, జోన్లు, సెక్టారుల్లో విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది నృత్యాలు, పాటలతో అలరించారు. అదనపు ఎస్పీ సదానందం, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి


