అన్నా.. అప్పు ఇస్తారా?
● రూ.2 నుంచి రూ.5 వడ్డీ తీసుకున్నా
ఫర్వాలేదు
● ఫోన్‌లో ఓట్ల కోసం గాలం
● ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు
జనగామ: పురపాలక ఎన్నికల ప్రచారం ముగిసినా జనగామ,స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభ్యర్థుల పరుగులు మాత్రం ఆగడం లేదు. ప్రచార పర్వంలో పది రోజులపాటు వాడివేడీగా తిరిగిన అభ్యర్థులు ఇప్పుడు ఫోన్‌కే పరిమితమై ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అన్నా గుర్తుంచుకో.. నేను గెలిస్తే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా.. నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసమే తెరిచి ఉంటాయి అంటూ తమ అనుచరులే కాక కీలక ఓటర్లకు వరుస కాల్స్ చేస్తూ గుర్తు చేస్తున్నారు. కుల సంఘాల కీలక నాయకులు, ప్రభావం చేసే ఓటర్లను టార్గెట్ చేస్తూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసే ప్రయత్నంలో అభ్యర్థులు, వారి బృందాలు అర్ధరాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. అభ్యర్థులు ఇలాగే ఫోన్‌లో మునిగిపోతుంటే, అనుచర వర్గం మాత్రం ప్రత్యర్థి ఏ ఎత్తు గడలు వేస్తున్నారో తెలుసుకుని దానికి పై మెట్టులో ఉండేలా ఆలోచనతో నిధుల సమీకరణ పనిలో తలమునకలైపోయారు. ఇదిలా ఉంటే ప్రచార వేడి తగ్గి పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ డబ్బు డిమాండ్ పెరుగుతోంది. ప్రచార ఖర్చులు అంచనాలను మించిపోవడంతో కొంతమంది అభ్యర్థులు మరింత ఇబ్బందుల్లో పడ్డారు. అన్నా.. రెండు నుంచి ఐదు శాతం వడ్డీకై నా రూ. 5 నుంచి రూ. 10 లక్షలు కావాలి.. కొంచెం సర్దిపెట్టు.. పేపర్ రాస్తా.. సాక్షుల సంతకం పెడతాను, రాత్రికి రాత్రే ఇవ్వాలంటూ తమకు దగ్గర వారిని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. పోలింగ్‌కు ఒక్క రోజు ముందుగానే ఓట్ల ప్రభావం కోసం మరికొందరు భారీ మొత్తంలో అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసినా అభ్యర్థుల గెలుపు కోసం పరుగులు, అప్పు వేట కొనసాగిస్తూనే ఉన్నారు.
నేటినుంచి పోలింగ్ కేంద్రాల
పరిసరాల్లో నిషేధాజ్ఞలు
వరంగల్ క్రైం : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేటలోని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఈనెల 10న (మంగళవారం) నుంచి నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలోని 200 మీటర్ల మేర ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 11వ తేదీ రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయని, ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
అన్నా.. అప్పు ఇస్తారా?


