బీఆర్‌ఎస్, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగుకాల్వలో వేసినట
● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగుకాల్వలో వేసినట్లేనని, ఘన్‌పూర్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతితో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మీ మద్దతుతోనే నిజాయితీకి మారుపేరుగా ఉన్నానన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తనను తిట్టడానికే రాజయ్యను బీఆర్‌ఎస్ పార్టీ కూలీగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. తాను రెండేళ్లలోనే నియోజకవర్గానికి రూ.1,400 కోట్లు తీసుకొచ్చానని, స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీ చేయడంతోపాటు రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, నాయకులు శిరీష్‌రెడ్డి, బెలిదె వెంకన్న, అన్నం బ్రహ్మారెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, జయపాల్‌రెడ్డి, పోశాల కృష్ణమూర్తి, కొలిపాక సతీశ్, పోగుల సారంగపాణి, అభ్యర్థులు బూర్ల శంకర్, గుర్రం హరనాఽథ్, గుర్రం హైమారమేశ్, కొంతం రజితాశ్రీనివాస్, పెసరు కృష్ణవేణిసారయ్య, బొల్లు లక్ష్మి, సంపత్‌రాజ్, సీహెచ్.సత్యనారాయణ, కనకం రమేశ్, అన్నెపు సుమలతకుమార్ పాల్గొన్నారు.
సమాధుల వద్ద ఓట్లు అడుగుతూ
వినూత్న నిరసన
కేసముద్రం: చనిపోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో తొలగించలేదంటూ ఓ స్వతంత్ర అభ్యర్థి సమాధుల వద్ద ఓట్లు అడుగుతూ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కేసముద్రం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్యర్థి భుక్యా బాలునాయక్.. వార్డు ఓటర్ లిస్టులో చనిపోయినవారి పేర్లు ఉన్నాయని, వాటిని అధికారులు తొలగించలేదని ఆరోపించారు. దీని వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని భావించి సమాధుల వద్ద నిరసన తెలుపుతున్నానన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీకి ఓట్లు వేస్తే మురుగుకాల్వలో వేసినట


