పారిశుద్ధ్యం అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

Dec 25 2025 8:33 AM | Updated on Dec 25 2025 8:33 AM

పారిశ

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

మానుకోట మున్సిపాలిటీలో సమస్యల తాండవం

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాల్లో సగానికి పైగా మరమ్మతుల బారిన పడి షెడ్డుకే పరిమితమయ్యాయి. దీనికి తోడు పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఇదిలా ఉండగా అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పందుల స్వైర విహారం చేస్తుండగా పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

143మంది మాత్రమే..

మానుకోట మున్సిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌లో 205 మంది సిబ్బంది ఉండగా, వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. 12 ట్రాక్టర్లు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 14 మూడు చక్రాల ఆటోలు, రోడ్డు స్వీపింగ్‌ మిషన్‌, కాల్వలు శుభ్రం చేసే వాహనం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిగ్నల్‌ కాలనీ, గాంధీపురం శివారులో చెత్త డంపింగ్‌ యార్డులు ఉన్నాయి.

వాహనాల మరమ్మతులు..

మానుకోట మున్సిపాలిటీలో 36 వాహనాలు ఉండగా.. వాటిలో 10 మూడు చక్రాల ఆటోలు, 5 నాలుగు చక్రాల ఆటోలు, ఒక ట్రాక్టర్‌ మరమ్మతుల బారిన పడ్డాయి. అవి అన్ని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉన్న షెడ్డుకే పరిమితమయ్యాయి. దీంతో పారిశుద్ధ్య పనుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. పలు కాలనీల్లో రోజు విడిచి రోజు చెత్త సేకరణ చేస్తుండగా.. శివారు కాలనీల్లో వారానికి రెండు రోజులు సేకరణ చేస్తున్నట్లు ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు.

వేధిస్తున్న కార్మికుల కొరత..

జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ మానుకోట.. అలాగే జిల్లా కేంద్రం కావడంతో పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయి. షాపులు, ఆస్పత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌, షాపింగ్‌మాల్స్‌ ఎక్కువగా ఉన్నా యి. అయితే అవసరాలకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికులు లేరు.. 143 మంది మాత్రమే ఉన్నా రు. వారిపై పనిభారం పడుతోంది. వారిలో కూడా కొంతమంది కార్మికులు అధికారుల ఇళ్లలో పని పనిచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమం జరిగినా పారిశుద్ధ్య కార్మికులు వెళ్లాల్సి వస్తోంది. కాగా, కార్మికుల సంఖ్య పెంచాలని సీడీఎంఏను కోరగా.. ఆదాయం పెంచుకుని కార్మికుల సంఖ్య పెంచుకోవాలని చెప్పడంతో చేసేది ఏమీ లేక ఉన్న వారితో నిర్వహణ చేపడుతున్నారు.

బిల్లుల జాప్యంతోనే షెడ్డులోనే వాహనాలు..

మెకానిక్‌లకు ఇచ్చే బిల్లుల్లో జాప్యంతో వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. స్పెషల్‌ ఆఫీస ర్‌ పాలన కావడంతో బిల్లుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో బిల్లులు ఆలస్యమవుతున్నాయని మెకానిక్‌లు వాహన మరమ్మతులకు ముందుకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో నెలల తరబడి షెడ్డులోనే ఉంటున్నాయి. రూ.55లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రోడ్డు స్వీపింగ్‌ మిషన్‌, రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన కాల్వలు శుభ్రం చేసే మిషన్‌ నెలల తరబడి షెడ్డుకే పరిమితమయ్యాయి.

పర్యవేక్షణ లోపం..

పారిశుద్ధ్య పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కమిషనర్‌, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాల్వలు శుభ్రం చేయడం లేదు. కొన్ని కాల్వలు తీసినప్పటికీ.. అక్కడి చెత్త కుప్పలు తీసుకెళ్లకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాటితో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

నామమాత్రంగా ఫాగింగ్‌..

మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్‌ నామమాత్రం చేస్తున్నారు. దీంతో దోమల సంఖ్య పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా వాడడం లేదు. తాగునీటి సరఫరాలోనూ సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌, అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ప్రత్యేక చొరవ తీసుకుంటేనే పారిశుద్ధ్యంత పాటు ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు కోరుతున్నారు.

మరమ్మతుల బారినపడిన వాహనాలు

వేధిస్తున్న కార్మికుల కొరత

పందుల స్వైర విహారం

అపరిశుభ్రంగా పరిసరాలు

రోగాల బారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

16 వాహనాలు మరమ్మతుల బారిన పడ్డాయి

మున్సిపాలిటీలో 16 వాహనాలు మరమ్మతుల బారిన పడి షెడ్డులో ఉన్నాయి. రెండు నెలలు కావస్తోంది. బిల్లుల ఆలస్యంతో మెకానిక్‌లు ముందుకు రావడం లేదు. అయితే రెండు రోజుల్లో వాహనాల మరమ్మతులు పూర్తి చేయిస్తాం. ఉన్న వాహనాలతో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తున్నాం. – శ్రీనివాస్‌,

వాహనాల అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌చార్జ్‌

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం1
1/3

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం2
2/3

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం3
3/3

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement