కోర్టు ఆవరణలో మరదలిపై బావ దాడి
జనగామ : కక్షలను మనసులో పెట్టుకుని కోర్టు పేషీకి హాజరైన మరదలి(తమ్ముడి భార్య)పై బావ హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణరెడ్డి, బాధితురాలి తల్లిదండ్రులు ముశిని బాలయ్య, యాదమ్మ కథనం ప్రకారం.. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన బూడిద అర్చన అలియాస్ అండాలుకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సుంచనకోటకు చెందిన బూడిద అశోక్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోగా, ఇరువర్గాల కేసు నమోదుతో వారు కోర్టు పేషీకి హాజరవుతున్నారు. ఈ క్రమంలో సుంచనకోట, కట్కూరు నుంచి రెండు వర్గాలుగా మంగళవారం కోర్టుకు వచ్చారు. అందులో బాధితురాలి బావ నర్సయ్య సైతం ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి అర్చన చెట్టుకింద కూర్చుని ఉండగా అదే సమయంలో నర్సయ్య బండరాయితో అర్చన తలపై రెండు సార్లు మోదాడు. మూడో సారి దాడిచేసే క్రమంలో అక్కడే ఉన్న కొందరు అడ్డుకోవడంతో ప్రాణా పాయం తప్పింది. వెంటనే గాయపడిన అర్చనను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పోలీసులు కోర్టు ప్రాంగణానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నర్సయ్యను అదుపులోకి తీసుకుని బాధితురాలి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బండరాయితో మోది హత్యాయత్నం
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోర్టు ఆవరణలో మరదలిపై బావ దాడి


