క్రీడలతో మానసికోల్లాసం
స్టేషన్‌ఘన్‌పూర్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నిట్ వరంగల్ పీడీ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య మాట్లాడుతూ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్‌బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా 12 కళాశాలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారని, పోటీలు రెండు రోజులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పీడీలు, పీఈటీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభం


