సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ఎంజీఎం : పుట్టుకతోనే తీవ్ర వినికిడి లోపం ఉన్న వరంగల్‌కు చెందిన 16 నెలల చిన్నారికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కేఎంసీలోని పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్ సూపరింటెండెంట్, సీనియర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ ఈఎన్‌టీ సర్జన్, తెలంగాణ రాష్ట్ర కోక్లియర్ ఇంప్లాంట్ నోడల్ ఆఫీసర్ మనీష్ గుప్తా చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పుట్టిన వెంటనే పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నట్లు గుర్తిస్తే కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా సరి చేయొచ్చన్నారు. తద్వారా మూగ, చెవిటి కాకుండా నిరోధించి సామాన్య జీవితం అందించొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం ఈఎన్‌టీ హెచ్‌ఓడీ సంపత్, ప్రొఫెసర్ విజయ్, కోఠి ఈఎన్‌టీ వైద్యురాలు వీణ, ఎంజీఎం అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ చిలక మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పద్మావతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


