చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ
విచారణకు ఆదేశాలు..
ఒగ్లాపూర్ గురుకులంలో జరిగిన ఘటనలు నా దృష్టికొచ్చాయి. రాష్ట్ర కార్యాలయం పనిచేసే జాయింట్ సెక్రటరీ సాక్రునాయక్ విచారణకు ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శికి అందజేస్తాం. ప్రతీ పాఠశాలలో క్యాట రింగ్ కాంట్రాక్టు వ్యవస్థ ఉంది. పిల్లలతో పనులు చేయించడం తప్పు. కచ్చితంగా చర్యలు ఉంటాయి.
–అలివేలు, జోనల్ అధికారి,
భద్రాద్రి కొత్తగూడెం జోన్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ (పరకాల) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలో చోటుచేసుకున్న దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఉదయం 5 గంటలకే ఎముకలు కొరికే చలిలో విద్యార్థులతో వెట్టి చాకిరీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏకంగా పాఠశాల ప్రిన్సిపాల్.. విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించడం.. వంటలు చేయించడం వంటి పనులు చేయించడమే కాకుండా పిల్లలను దూషించిన ఆడియో రికార్డులు వైరలయ్యాయి. బుధవారం ఉదయం పిల్లలతో టిఫిన్ చేయించిన ఓ వీడియో చక్కర్లు కొట్టింది. గురుకులంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్‌లో ఓ విద్యార్థి పాఠశాలలో జరుగుతున్న దారుణ ఘటనలు కళ్లకు కట్టినట్లు ఫిర్యాదు చేయడంతో పాఠశాలలో జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రిన్సిపాల్ విద్యార్థుల భవిష్యత్‌కు ఆటంకంగా మారడమే కాకుండా ఇష్టారాజ్యంగా వారిని దూషించడం, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
నిధులు పక్కదారి..
విద్యార్థుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు పక్క దారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల కాస్మోటిక్స్ చార్జిలను పక్కదారి పట్టించడంతో ఉన్నతాధికారులు గుర్తించి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. తాజాగా పాఠశాల కేర్‌టేకర్‌తో కుమ్మకై ్క వర్కర్లతో చే యించాల్సిన వంట పనులు, అది కూడా సలసల కాగే నూనెలో చిట్టి చేతులతో బొండా( టిఫిన్ ) వేయించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇతర పనులు చేయడం గమనార్హం. ఉపాధ్యాయులు స్టడీ సమయం విధుల్లో లేకపోవడంతో విద్యార్థులు సినిమాలు చూసిన ఘటనలో ఉపాధ్యాయులను వదిలి.. విద్యార్థులపై తీసుకున్న చర్యలు వివాదాస్పదంగా మారాయి. అలాగే, విద్యార్థులను ప్రిన్సిపాల్ కులం పేరుతో దూషించిన ఆడియో సైతం వైరల్‌గా మారింది.
గురుకుల పాఠశాలలో దారుణ ఘటనలు
పిల్లలతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్
విద్యార్థుల లేఖలతో వెలుగులోకి నిజాలు ..
సోషల్ మీడియాలో వీడియో వైరల్
‘సాక్షి’ ప్రత్యేక కథనం
చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ


