హన్మకొండ : విద్యుత్ బిల్లులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపు లేకుండానే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించారు. టైం ఆఫ్ డే ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే సంబంధిత ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారుల వర్గాలకు సాధారణం కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు కొనసాగిస్తున్నారు. ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు సంబంధిత వినియోగదారుల వర్గానికి వర్తించే ఎనర్జీ చార్జీలో 10 శాతం చొప్పున స్టాండ్ బై చార్జీల విధింపు కొనసాగనుంది.
గ్రిడ్ మద్దతు చార్జీలు కిలోవాట్‌కు నెలకు రూ.18.50 ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 70.29 లక్షల మంది వినియోగదారులుండగా తలసరి విద్యుత్ వినియో గం 1,680 యూనిట్లుగా ఉంది. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.22,754 కోట్లు అవసరం కాగా ప్రస్తుత టారిఫ్ (టారిఫేతర ఆదాయం కలుపుకుని) ద్వారా రూ.10,233 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
టారిఫ్ లోటు రూ.12, 521 కోట్లు ఉంది. సబ్సిడీలు కాకుండా ప్రతిపాదిత టారిఫ్‌లతోనూ ఆదాయ లోటు రూ.12, 521గా ఉంది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.19,814 కోట్లుగా సూచించగా, టారిఫ్ ద్వారా రూ.9,421 కోట్లు వస్తుందని సూచించారు. గతేడాది లోటు రూ.10, 387 కోట్లుగా ఉంది. టీజీ ఎన్పీడీసీఎల్‌కు ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గ త సంవత్సరంతో 2026–2027 ఆర్థిక సంవత్సరం లోటు పరిశీలిస్తే రూ.2,134 కోట్లు పెరిగింది.
2024–2025 ఆర్థిక సంవత్సరంలో 22,043 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయించగా రూ. 9,669 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–2026లో 23,741 మిలియన్ యూనిట్ల విక్రయానికి రూ.9,3 95 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అదే విధంగా 2026–2027లో 26,371 మిలియన్ యూనిట్లు విక్రయిస్తామని, దీనికి రూ.10,172 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 400 కేవీ సబ్ స్టేషన్లు 11 ఉన్నాయి. 220 కేవీ సబ్ స్టేషన్లు 44, 132/33 కేవీ సబ్ స్టేషన్లు 99, 132/11 కేవీ సబ్ స్టేషన్లు 20, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 2,594, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 2,594, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 3,51,115 ఉన్నాయి. ఎల్‌టీ వినియోగదారులు 70,23,808, హెచ్‌టీ వినియోగదారులు 5,317 ఉన్నాయి.
కావాల్సిన ఆదాయం రూ.22,754 కోట్లు
టారిఫ్‌ల ద్వారా వచ్చేది రూ.10, 233 ..
రెవెన్యూ లోటు రూ.12,521 ..
నష్టాల్లో టీజీ ఎన్పీడీసీఎల్


