వరంగల్ లీగల్ : బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కుటుంబీకులకు తెలియకుండా వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నేరం రుజువుకావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడ్ గ్రామానికి చెందిన బండి నవీన్ (19 సంవత్సరాలు)కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.14 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ విద్యార్థిని పరకాలలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న సమయంలో అక్కడ పుట్నాలు అమ్మే బండి నవీన్‌తో పరిచయమైంది. దీంతో ఇరువురు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నవీన్.. బాలికకు తెలిపాడు. దీనిని నమ్మిన సదరు బాలిక కుటుంబీకులకు తెలపగా వారు నిరాకరించారు. నవీన్‌ను బెదిరించారు. దీంతో నవీన్ పరకాల నుంచి ములుగు మండలం జంగాలపల్లిలోని తన బంధువుల వద్దకు వెళ్లాడు. కొద్ది రోజుల అనంతరం నవీన్ ఫోన్ చేశాడు. దీంతో 2020, డిసెంబర్ 02న సాయంత్రం కిరాణ షాపునకు వెళ్లొస్తానని సదరు బాలిక ఇంటినుంచి పారిపోయి జంగాలపల్లికి వెళ్లింది. మరుసటి రోజు నవీన్, సదరు బాలిక హనుమకొండకు వచ్చి అక్కడినుంచి తిరుపతి వెళ్లారు. తిరుపతిలోని తన మిత్రుడి గదిలో ఉన్నారు. ఈ సమయంలో సదరు బాలికను నవీన్ శారీరకంగా లోబర్చుకున్నాడు. కొద్దిరోజు అనంతరం బాలిక.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వారు 2020, డిసెంబర్ 28న తిరుపతి వెళ్లి బాలికను తీసుకుని పరకాలకు వచ్చారు. తదనంతరం గతంలోని ఫిర్యాదు మేరకు సదరు బాలికను కుటుంబీకులు పోలీసుల ఎదుట హాజరుపర్చారు. ఆమె వాంగ్మూలం మేరకు నవీన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లైంగిక దాడి నేరం రుజువుకావడంతో నేరస్తుడు నవీన్‌కు ఇరవై ఏళ్ల జైలుశిక్ష, రూ.14 వేల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. బాధిత బాలికల పరిహారపు చెల్లింపు పథకం కింద రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును ఏసీపీలు పి.శ్రీనివాస్, జె.శివరామయ్య, ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ పరిశోధించారు. లైజన్ ఆఫీసర్లు పరమేశ్వరి, కుమారస్వామి, భరోసా న్యాయవాది నీరజ పర్యవేక్షణలో కానిస్టేబుల్ ఎస్.సురేందర్, హోంగార్డు సారంగపాణి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి కేసు వాదించారు.
తీర్పు వెలువరించిన హనుమకొండ
మొదటి అదనపు జిల్లా కోర్టు
జడ్జి అపర్ణాదేవి


