హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
మహబూబాబాద్ రూరల్ : భూతగాదా విషయంలో అన్నను చంపిన ఘటనలో మృతుడి తమ్ముడు, అతడి ఇద్దరు కుమారులకు యావజ్జీవ కారాగార శిక్ష (జీవిత ఖైదు) తోపాటు ఒక్కొక్కరికి రూ. 21వేల చొప్పున జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పీఎస్ పరిధిలోని కేసముద్రం (విలేజీ)కి చెందిన ఎలగలబోయిన వెంకన్న, అతడి తమ్ముడి కుటుంబానికి మధ్య భూతగాదా వచ్చింది. ఈ క్రమంలో వెంకన్నను అతడి తమ్ముడు ఎలగలబోయిన చంద్ర య్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్ కలిసి 2020, ఆగష్టు 8వ తేదీన తీ వ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు అనిల్ అదే రోజున ఫిర్యాదు చేయగా అప్పటి కేసముద్రం బి.సతీశ్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐ జె.వెంకటరత్నం విచారణ చేయగా అప్పటి రూరల్ సీఐ ఎస్.రవికుమార్ 2021 మార్చి 23న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో బ్రీఫింగ్ అధికారులుగా అప్పటి కేసముద్రం ఎస్సై జి.మురళీధర్ రాజు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, జీనత్ వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ పక్షాన పీపీలు కొంపెల్లి వెంకటయ్య, చిలుకమారి వెంకటేశ్వర్లు, ఏపీపీ గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా కోర్టు డ్యూటీ అధికారులు నెలకుర్తి అశోక్ రెడ్డి, తేజావత్ దేవ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదనలు విన్న జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ నేరం నిరూపణకావడంతో ఎలగలబోయిన చంద్రయ్య, అతడి కుమారులు రాజశేఖర్, శ్రావణ్‌కు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.21 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
భారత్ సుస్థిర గణతంత్ర రాజ్యం
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
● ప్రభుత్వ పింగిళి కళాశాలలో జాతీయ సదస్సు
విద్యారణ్యపురి: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన సుస్థిర గణతంత్ర రాజ్యం దిశగా ఎదగాల్సిన అవసరం ఉందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఇండియా–2047 రియలిజింగ్ ది విజన్ ఆఫ్ ది డెవలప్ ఈక్విటబుల్ అండ్ సస్టేయినబుల్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలపర్చడానికి ప్రతీ పౌరుడు రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడం అత్యవసరమని సూచించారు. అతిథులు సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి అధ్యక్షత వహించిన సదస్సులో ఓయూ రాజనీతి శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్, సదస్సు డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, అకడమిక్ కో– ఆర్డినేటర్ డాక్టర్ అరుణ, అధ్యాపకులు శైలజ, కవిత, సంధ్య, రవికుమార్ పాల్గొన్నారు.


