పుట్టెడు దుఃఖంలోనూ మరువని బాధ్యత..
● తండ్రి మృతి చెందినా ఓటు వేసిన నాయకుడు
వర్ధన్నపేట: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువైందో ఆ నాయకుడు సమాజానికి చాటి చెప్పాడు. తండ్రి చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శ పౌరుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన పసునూరి రాజశేఖర్ బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన తండ్రి ఆదినారాయణ(65) అనారోగ్యంతో మృతి చెందాడు. రాజశేఖర్ తీవ్ర విషాదంలో ఉన్నా మనసు ధైర్యం చేసుకుని తండ్రి మృత దేహం వద్ద నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కు ఎంత విలువైందో సమాజానికి చాటి చెప్పాడు. దీనిపై గ్రామస్తులు.. రాజశేఖర్ బాధ్యతను కొనియాడారు.


