ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి
కేయూ క్యాంపస్: పౌరులందరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి పట్టాభి రామారావు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ (ఎన్‌జీఓ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం లేకుండా మానవ హక్కులు లేవని, ప్రజాస్వామ్య వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణ కీలకమని పేర్కొన్నారు. ఏపీ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ 2014 తర్వాత దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు విచ్చలవిడిగా పరిశ్రమలు నెలకొల్పి పర్యావరణానికి విఘాతం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు మాట్లాడుతూ తన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ ఆచార్య.. ఆ కాలంలో బ్రిటిష్‌వారిని ఎదిరించి పత్రికలను నడిపి జైలుకు వెళ్లి నిర్బంధ జీవితం గడిపారని గుర్తుచేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ (ఎన్‌జీఓ) జాతీయ చైర్మన్ ఐలినేని శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా మానవ సేవలకు, నిరుపేదల సమస్యల పరిష్కారానికి పౌరులు ముందుకు రావాలని కోరారు. సదస్సులో ఏపీ రాష్ట్ర చైర్మన్ సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారం, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర యాదవ్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు బాబుయాదవ్, చీఫ్ అడ్వయిజర్ రాజేశ్వర్‌రావు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, జిల్లా అధ్యక్షురాలు తులసి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డేగల శ్రీనివాస్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, డాక్టర్ బామిరెడ్డి నరసింహ తిరుపతి మాట్లాడారు.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్
జడ్జి పట్టాభి రామారావు
కేయూలో జాతీయ సదస్సు


