రైతు సంఘం నిర్మాణానికి కలిసి రావాలి
వరంగల్ చౌరస్తా: బలమైన రైతు సంఘం నిర్మాణానికి కమ్యూనిస్టులు కలిసి రావాలని జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అనుభవ్ దాస్ శాస్త్రి పిలుపునిచ్చారు. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని ఓ హోటల్‌లో రెండురోజులుగా జరుగుతున్న సభలు బుధవారం ముగిశాయి. అఖిల భారత రైతు సమాఖ్య నాయకుడు డాక్టర్ సత్నాంసింగ్ అజ్నాల అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనుభవ్ దాస్ మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం దెబ్బతీస్తున్న నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బలమైన రైతు సంఘం నిర్మాణం కోసం ఏఐకేఎఫ్ – జేకేఎస్ సంయుక్తంగా ఏకీకరణ ఆలిండియా మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకే రైతు విధానం ఉండాలని, ఒకరికి ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల ఇతర భూమి ఉండేలా ల్యాండ్ సీలింగ్ చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 400 నదులు ఉన్నాయని, వాటిని అనుసంధానం చేయడం వల్ల పంటలకు నీటి కొరత ఉండదని చెప్పారు. జీడీపీలో సుమారు 21 నుంచి 26 శాతం వ్యవసాయరంగం భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌లో కనీసం 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తూమాటి శివయ్య, కాటం నాగభూషణం, అజాత్ సింగ్, రమేష్ ఠాకూర్, కులదీప్ సింగ్, భూప్ నారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మే 12, 13, 14వ తేదీల్లో కిసాన్ మహా సభలు
జమ్మూరి కిసాన్ సభ జాతీయ కార్యదర్శి
అనుభవ్ దాస్ శాస్త్రి


