చట్టాలను ఉల్లంఘించొద్దు | - | Sakshi
Sakshi News home page

చట్టాలను ఉల్లంఘించొద్దు

Dec 11 2025 9:33 AM | Updated on Dec 11 2025 9:33 AM

చట్టా

చట్టాలను ఉల్లంఘించొద్దు

మహబూబాబాద్‌ రూరల్‌ : చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు అనుభవించాల్సి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన వందరోజుల ‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ క్యాంపెయిన్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2006లోనే బాల్యవివాహాలను నిరోధిస్తూ చట్టం వచ్చినప్పటికీ అది నేటికీ పూర్తిగా అమలుకు నోచుకోవట్లేదన్నారు. కొన్ని అలవాట్లు చట్టాలుగా మారుతాయని, మరికొన్ని అలవాట్లు సమాజానికి హానికరమైతే వాటిని నిషేధిస్తూ చట్టాలు వస్తాయని, అటువంటి వాటిలో బాల్య వివాహ నిషేధ చట్టం ఒకటని వివరించారు. జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టటానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి మాట్లాడుతూ.. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు వందరోజుల క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఉచిత న్యాయ సేవల టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100, చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098, గడపగడపకూ అవగాహన, ప్రత్యేక శిక్షణ తరగతులు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని, న్యాయ సేవా సంస్థ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతి మురారి, ఏ.కృష్ణతేజ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రేమ్‌ చందర్‌, జిల్లా సంక్షేమ అధికారిని సబిత, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నాగవాణి, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు, కక్షిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

న్యాయపరమైన రక్షణ రాజ్యాంగ హక్కు

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రతీ వ్యక్తికి జీవించే హక్కు, సమానత్వం, న్యాయపరమైన రక్షణ వంటి మౌలిక హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాజ్‌ కృష్ణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ సబ్‌ జైలులో బుధవారం ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జైళ్లలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు, పారాలీగల్‌ వలంటీర్ల నియామకం ద్వారా ఖైదీలకు న్యాయసహాయం అందుతుందని వివరించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీల వివిధ సమస్యలు, కేసులు ఆలస్యం అవుతున్న అంశాలు, బెయిల్‌ అవకాశాలు, అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ ద్వారా విడుదలకు అర్హత వంటి విషయాలను వివరించారు. న్యాయవాది లేకపోయినా ఖైదీలకు వెంటనే ఉచిత న్యాయవాది నియామకానికి దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేశారు. జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు న్యాయ, మానసిక, సామాజిక సహాయాన్ని అందించడానికి నల్సా రూపొందించిన స్పృహ అనే నూతన పథకం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్‌ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

షరతులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి

గార్ల: కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కందునూరి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తేమశాతం అధికంగా ఉందని కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. తాలు ఉందని లేనిపోని షరతులు పెట్టి మిల్లర్లు తరుగు తీస్తే ఊరుకునేది లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి అలువాల సత్యవతి, ఇమ్మడి గోవింద్‌, పెద్దవెంకటేశ్వర్లు, ఈశ్వర్‌లింగం పాల్గొన్నారు.

చట్టాలను ఉల్లంఘించొద్దు1
1/1

చట్టాలను ఉల్లంఘించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement