మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి | - | Sakshi
Sakshi News home page

మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి

Dec 11 2025 9:33 AM | Updated on Dec 11 2025 9:33 AM

మాటిచ

మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి

సాక్షి, మహబూబాబాద్‌: పుట్టిన ఊరికి సర్పంచ్‌గా ఎన్నికై తే ఆ కిక్కే వేరు. బరిలో నిలిచి నువ్వా నేనా.. అని చివరి వరకు పోరాటం చేసి గెలవడం సహజంగా జరిగే ప్రక్రియ. కానీ అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి.. మెప్పించి.. ఏకగ్రీవం కావడం అంటే ఆషామాషీ కాదు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులు, మరి కొన్నిచోట్ల నాయకుల సహకారంతో జిల్లాలో 43గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇప్పుడు సంతోష పడడం కాదు.. ముందుంది అసలైన కర్తవ్యం.. ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని చర్చ జరుగుతోంది.

ఊరికి మాటిచ్చి..

గ్రామాల్లోని సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అభ్యర్థులు, నాయకులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇందుకోసం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధికోసం పోటీలో ఉన్నవారందరూ డబ్బుల ఖర్చుపెట్టేందుకు పోటీ పడ్డారు. ఇందులో అత్యధికంగా డబ్బులు ఇస్తామని చెప్పిన వారికి సర్పంచ్‌ పదవి అప్పగించారు. అదే విధంగా గ్రామాల్లోని కోతుల బెడద తీర్చడం, తండాలు, ఆదివాసీ గూడేలు, గ్రామాల్లో దేవాలయాలు కట్టించడం, అభవృద్ధి పనులు చేయించేందుకు అంగీకార పత్రాలు, బాండ్‌ పేపర్లు రాసి ఇచ్చారు. మరికొన్ని చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల్లో ఒక పార్టీకి సర్పంచ్‌, మరొక పార్టీకి ఉప సర్పంచ్‌ పదవి ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోని పోటీ పడిన వారికి వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ, ఇతర పదవులు ఇస్తామని బుజ్జగించారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే చివరి వరకు పోటీలో ఉన్నవారిలో కొందరిని ఆర్థికంగా ఆశచూసి నామినేషన్‌ ఉసంహరించుకునేలా చేయాల్సి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. ఇలా ఊరికి, పోటీలో నిలిచి ఉపసంహరించుకున్న అభ్యర్థులకు, నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త సర్పంచ్‌లపై ఉంటుంది.

43 పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం..

మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్‌ వేయడం మొదలుకొని ఉపసంహరణ వరకు గ్రామాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నారు. జిల్లాలో 482 పంచాయతీలు, 4,110 వార్డులు ఉన్నాయి. ఇందులో మొదటి విడత 155జీపీలు, 1,338 వార్డులు ఉండగా.. ఇందులో 9పంచాయతీలు, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడతలో 158 పంచాయతీలు, 1,360 వార్డులకు గాను 15సర్పంచ్‌లు, 251వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడో విడతలో 169 గ్రామ పంచాయతీలు, 1,412 వార్డులు ఉండగా.. 19 పంచాయతీల సర్పంచ్‌లు, 272 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇలా మూడు విడతల్లో 43మంది సర్పంచ్‌లను, 768 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లాలో 43 గ్రామ పంచాయతీలు, 768 వార్డులు ఏకగ్రీవం

పలుచోట్ల అభ్యర్థుల నానా తంటాలు

డబ్బుల పంపిణీ, పనులపై హామీలు

ముందుంది అసలు కర్తవ్యం

మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి1
1/1

మాటిచ్చి.. మెప్పించి.. ఒప్పించి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement