ప్రైవేట్ ఆస్పత్రులపై ఆరా..
● అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం
● కొనసాగుతున్న అధికారుల విచారణ
నెహ్రూసెంటర్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అబార్షన్ల సంఘటనలపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. అలాగే పలు ఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపడుతున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా..
జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి దోషులను శిక్షించే పనిలో ఉన్నట్లు సమాచారం. వరుస సంఘటనపై రాష్ట్ర, జిల్లా అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
తనిఖీలతోనే సరి..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు, రోగులు మృత్యువాత పడడం, ఆందోళనలు పరిపాటిగా మారాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా సమాచారంతో ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు చేసిన సంఘటలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ పలుచోట్ల వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం తనిఖీలతోనే సరిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హతలేని వైద్యులు సైతం బోర్డులపై ఎండీలుగా రాసుకొని వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


