యాసంగి ప్రణాళిక ఖరారు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో వానాకాలం పంట కోతలు ముగుస్తుండడంతో యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. కాగా, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగి సాగు ప్రణాళిక రూపొందించడంతో పాటు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం ఆధారంగా వీటిని సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటలు నిండుగా ఉండడంతో అధికంగా పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరితో పాటు మొక్కజొన్న, ఆరుతడి పంటలు కూడా ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు.
2,55,527 ఎకరాల్లో పంటలు..
జిల్లాలో యాసంగి సాగు జనవరి వరకు కొనసాగనుండగా.. ఇప్పటికే ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జనవరిలో వరి పంట సాగు చేయనున్నారు. మొత్తంగా 2,55,527 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు ఖరారు చేశారు.
85,976 మెట్రిక్ టన్నుల ఎరువుల
ప్రతిపాదన..
యాసంగి సాగుకు మొత్తం 85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో యూరియా 59,273.78 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3157.025 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1828.75 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20978.86 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 738.02 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలోనే 40 శాతానికి పైగా ఎరువులను యాసంగి పంటల సాగుకోసం అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరం...
యాసంగి సాగు కోసం 55,288 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ద్ధం చేశారు. ఇందులో వరి విత్తనాలు 49,237 క్వింటాళ్లు, మక్కలు 5,056 క్వింటాళ్లు, జొన్నలు 71 క్వింటాళ్లు, వేరుశనగ 730 క్వింటాళ్లు, పెసర్లు 115 క్వింటాళ్లు, మినుములు 15.76 క్వింటాళ్లు, బొబ్బెర్లు 63 క్వింటాళ్ల మేరకు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు.
వరి తర్వాత.. మొక్కజొన్నకే ప్రాధాన్యం..
పంట కోతలు పూర్తవుతున్న పలు గ్రామాల్లో యాసంగి సీజన్ పనులను రైతులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పటికీ పలువురు రైతులు యాసంగిలో వరిపంటనే సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రెండో పంటగా మొక్కజొన్నకు ప్రాధాన్యత ఇస్తూ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీటికి తోడుగా ఎస్సారెస్పీ నీటి సరఫరాపై ఆశతో వరి సాగుతో పాటు మొక్కజొన్న సాగుకు ముందుకొస్తున్నారు. గతంలో యాసంగిలో వరిపంటతో పాటుగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాటు కోతుల బెడద కారణంగా ఆరుతడి పంటలను సాగు చేసేందుకు భయపడుతున్నారు.
2,55,527 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా
85,976 మెట్రిక్ టన్నుల ఎరువులు,
55,288 క్వింటాళ్ల విత్తనాలు
అవసరం
సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు
పంట ఎకరాలు
వరి 16,4124
మొక్కజొన్న 84,261
పెసర 2,879
మినుములు 394
జొన్న 1,565
వేరుశనగ 1,043
బొబ్బెర 1,261


